Sunday, August 16, 2009
అన్ని అక్షరాలూ అవసరమే !
కొందఱు చకారం ఉన్న ప్రతిచోటా సకారం పలుకుతారు. అలాంటివారు అసలు చకారాన్ని ఎత్తెయ్యండని కోరితే ఎత్తేద్దామా ? అలా కొందఱు పలకడాన్ని బట్టి, కొందఱు పలకకపోవడాన్ని బట్టి అక్షరాలు అంతరించినవని భావిద్దామా ? అలా అయితే అంతిమంగా తెలుగులో అన్నీ కలిపి ఇఱవై అక్షరాలైనా మిగుల్తాయో లేదో ! కాబట్టి కొందఱు కొన్ని అక్షరాలు పలక్కపోవడమనేది భాషకి ప్రమాణం కాదు. ఒక అక్షరాన్ని ఇంకో అక్షరంగా రాస్తే భాషలోని పదాల చరిత్ర అంతరిస్తుంది. తాను వ్యక్తిగతంగా పలికినా, పలక్కపోయినా దేన్ని ఎలా రాయాలో అలాగే రాయాలి. అంటే పూర్వీకులు ఏ వర్ణక్రమంలో రాశారో మనం కూడా అదే వర్ణక్రమంలో రాయాలి. దీన్ని standardization అంటారు.
Standardization వల్ల గతానికీ, వర్తమానానికీ, అలాగే వర్తమానానికీ, భవిష్యత్తుకీ మధ్య వారధి ఏర్పడుతుంది. అంటే గతకాలపు వారి మాటలు, ఈ కాలపువారికీ, ఈ కాలపువారి మాటలు భావితరాలకీ అర్థమౌతాయన్నమాట. అలాగే పదాల standardization వల్ల ఆ భాష మాట్లాడే వివిధ ప్రాంతాల, జాతుల మధ్య కూడా వారధి ఏర్పడుతుంది. అలా వారధి నిర్మించడమే ఏ దేశంలో నైనా విద్యావ్యవస్థ యొక్క ముఖ్యోద్దేశంగా ఉంటుంది. అందుకే ఉచ్చారణ ఎంత మారినప్పటికీ ఇంగ్లీషులో పదాల వర్ణక్రమాన్ని (spelling) అలాగే ఉంచేస్తారు. ఎన్ని లోపాలున్నా ఇంగ్లీషు పదాలు ప్రపంచవ్యాప్తంగా ఒకేలా రాయబడతాయి.ఒకప్పుడు పలికి ఇప్పుడు మానేసిన అక్షరాల్ని కూడా silent letters పేరుతో రాతలో నిలబెడతారు. వారికంటే మన అభ్యుదయదృక్పథం గొప్పది కాదని ఎవరైనా అంగీకరించాల్సిందే.మనలా ఎవరికి వారు ఇష్టమొచ్చినట్లు ఒక్కొక్కపదానికీ ఒక్కొక్క గుణింతం రాస్తూ పోతే భాష ప్రయోజనమూ, standardization తద్ద్వారా విద్యావ్యవస్థ ప్రయోజనమూ కూడా దెబ్బదింటాయి. అలాంటి యథేచ్ఛావర్తన మన ఆత్మగౌరవాన్నో, నిరంకుశత్వాన్నో తప్ప మన దూరదృష్టిని ప్రతిఫలించదు. అదీగాక మన తెలుగులా ప్రమాదంలో పడ్డ భాషలు పూర్వవారసత్వంలో ఏ అంశాన్నీ పోగొట్టుకోవడం మంచిది కాదు. అన్నింటినీ ప్రయత్నపూర్వకంగా నిలబెట్టుకోవాల్సిందే.
శకటరేఫ [ఱ] విషయానికొస్తే, తెలుగులో ఈరోజు మనం పలుకుతున్న ప్రతి రేఫసహిత శబ్దాన్నీ శకటరేఫగానే పలుకుతున్నాం. అంటే మనం సాధారణ రేఫ [ర] అంటున్నది నిజానికి తెలుగురేఫ కాదు. మనం దాన్ని పలకడం మానేసి శతాబ్దాలవుతోంది. ఈ సాధారణరేఫ అనేది సంస్కృతంలోను, దానికి సంబంధించిన ఇంగ్లీషు, జర్మన్ లాంటి భాషల్లో ఉంది. దీన్ని స్పష్టాస్పష్టంగా వినపడీ వినపడనట్లు తేల్చి పలుకుతారు. రేఫని తెలుగువాళ్ళు అలా ఎప్పటికీ పలకరు. కనుక మనం (తెలుగువాళ్ళం) వ్రాతలో వాడాల్సింది సర్వేసర్వత్రా శకటరేఫనే గానీ సాధారణరేఫని కాదు. కానీ మన ఉపాధ్యాయుల పుణ్యమా ! అని చిత్రంగా ఏం జఱిగిందంటే - తెలుక్కి స్వాభావికం కాని సాధారణరేఫ సహజరేఫగాను, శకటఱేఫ అనవసరపు అక్షరంగాను పరిగణనలోకి రావడం.
ఏ అక్షరాన్నైనా అనవసరపు అక్షరంగానో, లేదా తీసేసి వేఱే అక్షరాలతో ప్రతిక్షేపించదగ్గ అక్షరంగానో భావించడం దూరదృష్టి లేని ధోరణి అనిపించుకుంటుంది. కొన్ని అక్షరాలు తెలుగు పదాల్ని రాయడానికి తక్కువ ఉపయోగపడినప్పటికీ, లిప్యంతరణ (transliteration) చేయాల్సి వచ్చిన సందర్భాల్లో బాగా ఉపయోగపడతాయి. ఉదాహరణకి మహాప్రాణ పకారానికి [ఫ] అటు సంస్కృతంలో గానీ, ఇటు తెలుగులో గానీ ఉపయోగం తక్కువ. కానీ [f] ధ్వనితో కూడుకొన్న ఆంగ్ల, ఉర్దూ, అరబిక్ శబ్దాల్ని వ్రాయాల్సి వచ్చినప్పుడు అది ఈరోజు మనకి లెస్సగా ఉపయోగపడుతోంది. అలాగే ఇప్పుడు చాలా మంది దంత్యజకారపు గుర్తుతో తెలుగు జకారాల్ని రాయడం మానేశారు. కానీ ఇంగ్లీషులోని [z] అనే అక్షరపు ధ్వనికి తెలుగులో సక్రమంగా లిప్యంతరణ చేయాలంటే దంత్య జకారం తప్ప వేఱే దారి లేదు. అలా సక్రమంగా తెలుగులోకి లిప్యంతరణ జఱక్కపోతే మనం ఆ లిప్యంతరణని అవహేళన చేస్తున్నాం. ఉదాహరణకి - బ్యాంకు. అలా ఇఱవయ్యాఱక్షరాల ఇంగ్లీషుతో యాభయ్యాఱక్షరాల తెలుగుని పోల్చి కించపఱుస్తున్నాం. కానీ అదే సమయంలో సక్రమమైన లిప్యంతరణకి ఉపకరించే తెలుగక్షరాల అస్తిత్వాన్నే సవాలు చేస్తున్నాం, "మేము పలకలేము, మేము రాయలేము" అనే ఆత్మాశ్రయ (subjective) కారణాల్ని ఉటంకిస్తూ! మన తెలుగువాళ్ళు ఏ భాషాపదాలనైనా సునాయాసంగా పలుకుతారనే ప్రతిష్ఠ మనకుంది. విదేశీభాషల్ని నేర్చుకోవడానికి ఇతరుల మీద మనకున్న edge మన తెలుగులిపి, అది తరతరాలుగా తీర్చిదిద్దిన మన నాలుకలు. అక్షరాల్ని అనవసరమని భావించడమంటే ఆ edge ని వదులుకోవడమే అవుతుంది.
మన అశక్తత, లేదా మన అక్షరాల గుఱించి మనకి మాత్రమే ఉన్న అపోహలూ, అజ్ఞానాలూ - ఇవే మనకి ప్రమాణమై కూర్చున్నాయి. భాష యొక్క గతమూ, భవిష్యత్తు మనకి పట్టడంలేదు. ఈ పరిస్థితి మారాలి. మన భాష తత్త్వాన్ని, చరిత్రనీ మనం సమీచీనంగా అవగాహన చేసుకోవాలి. ఇతరులకి బోధపఱచాలి కూడా. భాషకున్న assets ని liabilities గా భావిస్తూ వస్తున్న ఈ కుహనా అభ్యుదయ వాదాన్ని మనం ప్రయత్నపూర్వకంగా దూరంగా పెట్టాలి. ఇది అభ్యుదయవాదం కాదు, ఒక సైతాన్ అని అందఱూ గుర్తించే శుభదినం రావాలి.
Wednesday, April 01, 2009
వేగుకే నా వోటు
ఈ ఇష్టాలకీ, అనిష్టాలకీ వెనక ఉన్న సంభావ్య కారణాల (probable reasons) ని కొంచెం విశ్లేషించుకుందాం. మన తెలుగువాళ్ళలో ముఖ్యంగా మూణ్ణాలుగు మానసిక ప్రపంచాలున్నాయి. గతంలో ఈ ప్రపంచాల వాళ్ళందరినీ నేను వ్యక్తిగతంగా కలుసుకొని మాట్లాడాను.
౧. మొదటి ప్రపంచం :- ఇందులో తెలుక్కి విలువ తక్కువ. తెలుగుపదాలు తప్ప ఇంకేవైనా ముచ్చటగా, విలువగా, హుందాగా, ఉన్నతశ్రేణిగా ధ్వనిస్తాయి.
౨. రెండో ప్రపంచం :- ఇందులో సంస్కృతానికి విలువ చాలా ఎక్కువ. అదే సమయంలో అన్ని ఇతరభాషాపదాలూ చిన్నచూపు చూడబడతాయి.
౩. మూడో ప్రపంచం :- ఇందులో ఇంగ్లీషుకు విలువ చాలా ఎక్కువ. ఇంగ్లీషుని ఇతరభాషాపదాలతో corrupt చేస్తే భరించలేరు. కానీ అన్ని ఇతరభాషల్నీ వీరు ఇంగ్లీషు పదాల మిశ్రమంతో corrupt చేస్తారు. ఎవరైనా అలా corrupt చెయ్యకుండా మాట్లాడితే ఆ తెలుగు తమకర్థం కాదని చెబుతూ వీరు నిస్సహాయత వ్యక్తం చేస్తారు. అదనపు తెలుగు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయడం కూడా అవమానకరంగా, తమ స్థాయికి తక్కువగా భావిస్తారు.
౪. నాలుగో ప్రపంచం :- ఇందులో హిందీకి విలువ చాలా ఎక్కువ. "హిందీ - హిందూ" లని వీరు పర్యాయపదాలుగా భావిస్తారు. వీరి దృష్టిలో తెలుగుజాతి అసలు జాతే కాదు. జాతి అంటే హిందీవాళ్ళు. జాతీయభాష అంటే హిందీ. తక్కినవాళ్ళంతా చిల్లరమల్లర మనుషులు. వాళ్ళూ, వాళ్ళ భాషలూ లేకపోయినా భారద్దేశానికి నష్టం లేదు. మన భాషల్నీ, లిపినీ కూడా హిందీకి అనుగుణంగా తీర్చిదిద్దుకోవాలని వీరు అభిప్రాయపడతారు.
తెలుగుని ఇతరభాషాప్రసక్తి (with no reference to any other language) లేకుండా తెలుగుని తెలుగ్గా ప్రేమించే మానసిక ప్రపంచంవాళ్ళు మాత్రం నాకెక్కడా తగల్లేదు. అసలు ఆ ప్రపంచమేదీ లేదని నా అనుమానం. ఎన్నిసార్లు లెక్కపెట్టుకున్నా అలాంటివాణ్ణి నేనొకణ్ణే కనపడుతున్నాను. లేదా అది ప్రస్తుతానికి నా వ్యక్తిగత దృక్కోణం కూడా అయి ఉండొచ్చు. కాదనడం లేదు. అయితే ఈ పై నాలుగు మానసిక ప్రపంచాలూ తెలుగు అభివృద్ధికి ఇనప గొలుసులు, తెలుగుతల్లి కాళ్ళకి బొండలు అని నేననుకుంటాను. తెలుగు బాగుపడాలంటే, తెలుక్కి గౌరవాన్ని సమకూర్చిపెట్టాలంటే ముందు ఈ ప్రపంచాల్లోంచి మనం బయటపడక తప్పదు. మన భాషావిధేయతలన్నీ (loyalties) పూర్తిగా - నూటికినూరుశాతం, బేషరతుగా తెలుగు వైపు మళ్ళించుకోవాల్సి ఉంది. ఎన్ని భాషలు నేర్చుకున్నా అవన్నీ కేవలం సమాచారప్రాయమే తప్ప తల్లిలాంటి తెలుక్కి ప్రత్యామ్నాయం కాదని గ్రహించాలి. ఆ ఎరుకనంతా తెలుగు అభివృద్ధికే వినియోగించాలి.
Email అనే అర్థంలో వేగు
ఇది గత కొద్ది సంవత్సరాలుగా తెలుగు జాలంలో, బ్లాగులలో వాడుకలో ఉంది. వేగు అంటే సమాచారం, సందేశం. ఇది పాత తెలుగులోంచి పునరుద్ధరించబడిన ఒక అచ్చతెలుగు మాట. ఇది వాడుకలో స్థిరపడ్డానికి గట్టి కారణాలు కొన్నున్నాయి.
౧. ఇది క్లుప్తమైనది.
౨. పలకడానికి వీలైన తెలుగుపదం. దీని అచ్-హల్ నిర్మాణం (vowel and consonant structure) లో విదేశీయత లేదు.
౩. దీని ధ్వనిలో ప్రౌఢపాండిత్య స్ఫోరకత లేదు. అందుచేత ఇందులో కృత్రిమత్వం లేదు.
౪. పదాల పట్ల ప్రజల దృష్టిలో ఒక bias ఉంటుంది. తెలిసిన పదాల్ని మార్పుచేసి వాడుకుంటే పాత అర్థాలు స్ఫురించడం మానవు. అందుచేత అలాంటి పదాల పట్ల వారిలో మానసిక ప్రతికూలత ఉంటుంది. అందుచేత వారు వాటి ఇంగ్లీషు సమానార్థకాలనే వాడ్డానికి మొగ్గు చూపవచ్చు. అందుచేత మనకి Unique words కావాలి. పాత తెలుగు అలాంటి పదాల్ని బాగా సరఫరా చెయ్యగలదు. ఉదాహరణకి Seminary అనే పదం ఉంది. క్రైస్తవమతవిద్యాలయం అని అర్థం. కానీ ఇలా అనువదిస్తే True Translation అవుతుంది. పాత తెలుగులో దీనికి ఘటిక అనే పదం లభ్యమవుతోంది. హిందూధర్మశాస్త్ర పాఠశాల అని అప్పటి అర్థం. తెలివైనవాళ్లు దీన్ని ఆధునికంగా అర్థపరివర్తనం చేసి క్రైస్తవమతవిద్యాలయానికే కాక
ఇస్లామిక మదర్సాలకి కూడా వాడుకోవచ్చు.
౫. వేగు అలాంటి Unique word. పైగా వాడుకలో ఉన్న పదం కాదు. పునరుద్ధరించబడిన పదం. అందుచేత దాని పట్ల తెలుగు నెటిజెన్స్ లో Negative bias లేదు. కనుక వారు దాన్ని స్వాగతించారు. అందుచేత వాడుకలో లేని పాత తెలుగు పదాలకి నూతన అర్థావగతి కల్పించడం మంచిదని ఇదివరకు జరిగిన చర్చల్లో మేమంతా అనుకున్నాము. ఈ పని ఇంగ్లీషులో కూడా జరిగింది. జరుగుతోంది. అందుచేత ఈరోజున కలనయంత్రశాస్త్రంలో వినిపించే ఇంగ్లీషు గత 15-25 ఏళ్ళలో మాత్రమే ఉనికిలోకి వచ్చింది తప్ప అంతకుముందు లేదు.
౬. ఇది Unique word కావడం వల్ల చేత్తో భౌతికంగా కాయితం మీద రాసే ఉత్తరానికీ, జాలం ద్వారా పంపే ఉత్తరానికి మధ్య గల తేడాని స్పష్టంగా సద్య: స్ఫురణ చేయించగలదు.
పదపునరుద్ధరణ ద్వారా మనం తెలుగుభాషని నిలబెట్టినవాళ్ళం కూడా అవుతాం. అందుచేత నేను మాత్రం వేగు అనే వాడుతున్నాను. ఇకముందు కూడా వాడుతూనే ఉంటాను. ఇది నిర్హేతుక అభిమతం కాదు.
Manipulation కి మాండలికాలకీ సంబంధమేంటి ?
పల్లెపట్లలో చాలా ముచ్చటైన దేశిపదాలు వాడుకలో ఉన్నాయి. వాటిల్లో చాలావరకు ఇంగ్లీషు పదాలకి సమాధానం చెప్పగలవే. అయితే మనకి అవి తెలియకపోవడం. గ్రామీణులకేమో - అవి మనకి - అనగా పదనిష్పాదకులకి అవసరమని తెలియకపోవడం, ఈ కారణాల వల్ల పరస్పర సమాచార లోపం (communication gap) తీవరించి మనం క్రమంగా అసలైన తెలుక్కి దూరంగా, సుదూరంగా జఱిగిపోతున్నాం. "ఇంగ్లీషుపదాలే original, తెలుగుపదాలు True Translation, తెలుగంటే సంస్కృతం" అనే అభిప్రాయంలో పడి ఊగిసలాడుతున్నాం. కొన్నిసార్లు కొత్తపదాల్ని నిష్పాదించినవారే వాటిని వాడని పరిస్థితి కూడా లేకపోలేదు.
మాండలికాలు లేకుండా తెలుగు పరిపూర్ణం కాదు. ఆ పదాల్ని ఆయా జిల్లాలకీ, తాలూకాలకీ పరిమితం చెయ్యకుండా శిష్టవ్యావహారికంలోకి, సాహిత్యపు ప్రధాన స్రవంతిలోకి తీసుకు రాగలిగితే, అందరికీ వాటి వాడుకని అలవాటు చెయ్యగలిగితే భాషకి మహోపకారం జరుగుతుంది. అనువాదాలు చేసేటప్పుడు గానీ, సమానార్థకాల్ని రూపొందించేటప్పుడు గానీ మన భావదారిద్ర్యమూ, పదదారిద్ర్యమూ వదిలిపోతాయి. అంతకంటే ముఖ్యంగా సమానార్థకాలకి కృత్రిమత్వ దోషం నివారించబడి సహజ తెలుగుతనపు పరిమళాలు గుబాళిస్తాయి. మూర్త నామవాచకాల్ని(Material Nouns) ని అమూర్త నామవాచకాలు (Abstract Nouns) గా పరివర్తించడం ద్వారా చాలా బౌద్ధిక పదజాలాన్ని (intellectual vocabulary) నిష్పాదించవచ్చు. ఇందుకోసం మనకి వ్యవసాయంతో సహా వివిధ గ్రామీణ వృత్తుల పదజాలాలు సహకరిస్తాయి. వాటిల్లో కొన్ని ఇప్పటికే సాహిత్యభాషలోకి ప్రవేశించాయి. అవి అలా ఇంకా ఇంకా ప్రవేశించాలనీ సాహిత్యానికీ, ప్రజలకీ మధ్య ఏర్పడిన తెగతెంపులు (disconnect) రద్దు కావాలనీ ఆశిస్తున్నాను.
ఉదా:- తూర్పాఱబట్టడం - (భౌతికార్థం) వడ్లు జల్లించడం ;
(సాహిత్యార్థం) నిందించడం మొ||
ఉదాహరణకి - తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వాడే "కిట్టింపు" అనే పదాన్ని తీసుకుందాం. లెక్కలో వచ్చే హెచ్చుతగ్గుల్ని సరిపెట్టడానికి ఈ పదాన్ని వాడతారు. ఇది ప్రధానంగా బళ్ళలోను, ట్యూషన్లలోను వినపడే పదం. ఎలాగైనా సరే answer వచ్చేలా చెయ్యడమన్నమాట. ఇది సానుకూలార్థం (positive meaning) లో వాడే పదం మాత్రం కాదు. ఇది కిట్టింపు ఎందుకయిందంటే-
కిట్టు - సరిపోవు
కిట్టుబాటు - గిట్టుబాటు
కిట్టించు - సరిపోయేలా చేయు
ఈ రకమైన కిట్టింపు (manipulation of accounts) ని మనం సత్యం కుంభకోణంలో గమనించాం. మన పాత్రికేయులెవరైనా ఈ పదం వాడతారేమోనని చూశాను. ఎక్కడా కనిపించలేదు. దాన్ని బట్టి చూస్తే మనం ప్రజలకి నేర్పాల్సినదానికన్నా వారినుంచి నేర్చుకోవాల్సిందే ఎక్కువుందనిపిస్తోంది.
Saturday, March 28, 2009
ప్రామాణికత వేఱు - సౌలభ్యం వేఱు
ఇదొక ప్రామాదిక అభిప్రాయం. ఇదొక బర్బరవాదం. మనుషులు సాహిత్యం నుంచి, ప్రామాణికులైన మేధావుల నుంచి నేర్చుకోవాల్సిన అవసరాన్ని, బౌద్ధికంగా ఎదగాల్సిన అవసరాన్ని ఇది రద్దు చేయబూనుకుంటోంది. ఇది ఎక్కడున్నవాళ్లు అక్కడే ఉండాలని ఆశిస్తోంది. ప్రామాణికాలంటూ ఏమీ లేవని, ఉండవని, ఉండకూడదనీ చెప్పడం దీని అంతరార్థంలా తోస్తోంది.
వాడుకలో ఉన్న ప్రతిదీ ప్రామాణికం కాదు. అదే నిజమైతే ఏ భాషాప్రజలకీ తమ భాషావ్యాకరణం అవసరం లేదు. అలాగే వారికి నిఘంటువులు కూడా అవసరం లేదు. ప్రామాణికం అనేదానికున్న అర్థం బహులోతైనది. ఒక పదానికి లేదా వాడుకకి ప్రామాణికత ఎలా సిద్ధిస్తుందో అర్థం చేసుకుంటే ఆ ప్రక్రియ ముందు వాడుక అనేది ఎంత చిన్న విషయమో మనకి అర్థమవుతుంది. పై అభిప్రాయాన్ని ప్రామాణికంగా తీసుకుంటే ప్రతివాడూ తన ఇష్టమొచ్చినట్లు రాస్తూ, పలుకుతూ అలాంటి తప్పుల తడిక భాషని తన అధికారబలాన్ని, మందబలాన్ని, మందిబలాన్ని ఉపయోగించి తన అజ్ఞానాన్ని వాడుకభాష పేరుతో ఇతరుల నెత్తిన రుద్దుతూ చెలరేగిపోతాడు. (ఇప్పుడు జఱుగుతున్నది అదేననుకోండి) ఆ తరువాత కొద్ది వందల సంవత్సరాల అనంతరం ఆ భాషాప్రజలు వెనక్కి తిరిగి తమ భాష వైపు చూసుకున్నప్పుడు వారసత్వం స్థానంలో ఒక అస్తవ్యస్తపు సాంస్కృతిక అరాచకం గోచరిస్తుంది.
పదస్వరూపాలకి ప్రామాణికత సరైన వ్యుత్పత్తుల (etymologies) ద్వారాను, శబ్దార్థాల యొక్క సమ్యక్ సమన్వయం ద్వారాను సిద్ధిస్తుంది. ఒకే పదానికి అనేక వ్యుత్పన్నాలు (derivatives) ఉన్నప్పుడు వాటిల్లో ఒకదాన్ని మటుకు బొత్తిగా మిగతావాటితో సంబంధం లేని అర్థంలో వాడుతూంటే, అలా ఎంతమంది వాడినా సరే, అది ప్రామాణికం కాదు. అది సరిచెయ్యదగ్గ పొఱపాటు మాత్రమే. అలాగే పదం యొక్క అసలు వ్యుత్పత్తినే నిర్మూలించే విధంగా కొంతమంది పలుకుతున్నారనే కారణం చేత ఆ దోషభూయిష్ఠ ఉచ్చారణ ప్రామాణికం కాదు. అది సరిచెయ్యదగ్గ
పొఱపాటు మాత్రమే. అలా అసాధురూపాలు ప్రామాణికం అవాలంటే ఆ భాషకున్న వేలాది సంవత్సరాల చారిత్రిక నేపథ్యం చాలావఱకు (మళ్ళీ లభ్యం కావడానికి వీల్లేనివిధంగా) నశించాల్సి ఉంటుంది.
పదస్వరూపాలకి ప్రామాణికత ప్రామాణిక వ్యక్తుల వాడుక ద్వారా, వారు రచించిన ప్రామాణిక గ్రంథాల ద్వారా వ్యాపిస్తుంది. ఒక్కొక్క జీవనరంగంలోను ఒక్కొక్క విధమైన ప్రామాణికులు ఉంటారు. రాజకీయాల్లో ప్రామాణికుడైన వాడు కళల్లో ప్రామాణికుడు కాడు. కళల్లో ప్రామాణికుడైనవాడు వ్యాపారరంగంలో కాడు. అలాగే భాషాసాహిత్యాలలో ప్రామాణికులైన వ్యక్తులే పదస్వరూపాలకి ప్రామాణికులు. వారు తమ సొంతుగొంతుగా, తమ సొంత అభిప్రాయంగా, తమ సొంత కల్పనగా వినిపించినవాటిల్లో ఏయే వాడుకలు చేశారో అవే ప్రామాణికం. అంతేగానీ దారిన పోయే ప్రతి ఎల్లయ్య, పుల్లయ్య చేసే వాడుకలు ప్రామాణికం కావు - ఆ ఎల్లయ్యలూ, పుల్లయ్యలూ ఎంతమందున్నా సరే, సాహిత్యంలోను, భాషలోను వాళ్ళకి విలువ లేదు. వాళ్ళు ప్రామాణికుల్ని అనుసరించాల్సినవాళ్ళే తప్ప, అనుసరించదగ్గ వ్యక్తులు ఎంతమాత్రమూ కారు, కాజాలరు.
వాడుక ఒక సౌలభ్యం. అంతే తప్ప దానికి ప్రామాణికత లేదు. రెండింటినీ కలిపికొట్టడం, రెండింటికీ అభేదం పాటించడం కమ్యూనిస్టు రాజకీయం అవుతుంది తప్ప భాషాపరిజ్ఞానం అనిపించుకోదు. అది పూర్తి అజ్ఞానపూర్వకం. ఒకడు సోషలైజేషన్ అని పలకలేక సోసలైజేసన్ అంటాడు. అది అతని సౌలభ్యం. నాకు తెలిసిన ఒకాయన తొంభై కి టొంబై అనేవాడు. అది ఆయన సౌలభ్యం. అంతే తప్ప అది ప్రామాణికం కాదు.
ప్రజాస్వామ్యమైనంత మాత్రాన జనం సర్వజ్ఞులు కారు. జనానికి "ఇది తప్పు, ఇది ఒప్పు" అని చెప్పే హక్కు, బాధ్యతా విషయపరిజ్ఞునం గల మేధావులకి, ప్రామాణికులకీ తప్పనిసరిగా ఉన్నాయి. ఉండితీఱతాయి. అంతే తప్ప వాళ్ళు అజ్ఞానుల తోక పట్టుకొని నడవాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు. వారు సాంస్కృతిక నాయకులు. జనాల తప్పుల్ని సరిదిద్దకపోతే వాళ్లు విద్యావ్యవస్థ నుంచి పొందాల్సిన ప్రయోజనాన్ని పొందలేకపోతారు. Role Models, ప్రామాణికాలూ, మార్గదర్శకాలూ లోపించడం చేత వాళ్ళలో సృజనాత్మకత కూడా ఎదగాల్సినట్లుగా ఎదగదు.
Monday, March 09, 2009
ద్వేషులు సంస్కర్తలు కాజాలరు
ఆంగ్లభాషా వ్యామోహపరులకీ, ఆ వ్యామోహం వల్ల దేశీయమైన ప్రతి విషయాన్న్నీ చిన్నచూపు చూసే వారి సిద్ధాంతాలకీ, వాదాలకీ అణా-పైసా విలువ కూడా ఇవ్వకూడదు. వాళ్ళకున్న చారిత్రిక విలువ పదిపైసలు కాగా వాళ్ళకి అనవసరంగా రూపాయి విలువివ్వడం వల్లనే మన జాతీ, భాషా కోలుకోలేనివిధంగా పాడైపోయాయి. వారు హిపోక్రైట్లు. తెలుగులోని పదాల్ని దిగజార్చి పలకడానికి, తెలుక్కి అక్షరాలే లేకుండా చెయ్యడానికీ వాళ్ళు వెనుకాడరు. కానీ ఇంగ్లీషు దగ్గఱికొచ్చేసరికి దాని, స్పెల్లింగులూ, గ్రామరూ, ఇడియములూ, ఫ్రేజులూ, అమెరికానిజములూ, వీలైతే స్ట్రెస్సు, ఇంటోనేషనూ మొదలైనవాటితో చచ్చీచెడీ కుస్తీపడుతూంటారు. సరైన తెలుగు మాట్లాడినా, రాసినా దాన్ని చాదస్తంగా భావించే వీరు ఎవరికీ అర్థం కానిశై లిలో ప్రౌఢమైన ఇంగ్లీషు రాయడానికి యమ తాపత్రయపడుతూంటారు.తెలుగు దగ్గఱికొచ్చేసరికి మాత్రం వారు అతిసామాన్యులుగా అవతారం ధరిస్తారు. ఏమీ అర్థం కానట్లు మొహం పెడతారు. తెలుగులో ఒక కొత్తపదం ఎదురైనా సహించలేని వీరు, నేర్చుకోవడానికి సమయం లేదనే వీరు, ఏకంగా ఇంగ్లీషు నిఘంటుశబ్దాలనే బట్టీ పట్టడానికి మాత్రం చాలా తీఱిక చేసుకుంటారు. ఇంగ్లీషు దగ్గఱికొచ్చేసరికి ఆ భాషాజ్ఞానాన్ని ఖడ్గంలా ఝళిపించి ఇతరుల్ని దడిపించడానికి, బౌద్ధికంగా లొంగదీసుకోవడానికీ ప్రయత్నిస్తారు. తెలుగులో మంచిమంచి ఆధునిక గ్రంథాలు వచ్చినా, తెలుగు పదాలు అభివృద్ధి చెందినా వీరు సహించలేరు. వారి దృష్టిలో ఇంగ్లీషు ఒక్కటే అభివృద్ధి చెందిన భాష. అదెప్పుడూ అలాగే ఉండాలి. తెలుగు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. తెలుగే తమ జీవితంలో తాము నేర్చుకున్న తొలిభాష అని మర్చిపోతున్న వీరు, తెలుగు విస్తృతంగా వాడుకలోకి వస్తే తాము సాముగరిడీలు చేసి అభ్యసించిన ఇంగ్లీషు ఉపయోగపడకుండా పోతుందేమోనని భీతిల్లుతారు. ఎగతాళికి పూనుకుంటారు. తెలుగుని విమర్శించడం తప్ప తెలుక్కి వారు చేసే వితరణ ఏమీ ఉండదు.
తెలుగులో అక్షరాల పట్టింపు వద్దంటున్నవారు ఇంగ్లీషులో స్పెల్లింగుల పట్టింపు వదిలేశారేమో అడగండి. మరి ఈ Change, మార్పు సూత్రాలూ ఇంగ్లీషుకి వర్తింపజేయడానికి ఎందుకు భయపడుతున్నారు ? / తెలుక్కి మాత్రమె ఎందుకు వర్తింపజేస్తున్నారు ? ఈ మెట్టవేదాంతాలు మొదట్నుంచి తెలుగువాళ్ళకి మాత్రమే ఎందుకు చెబుతున్నారు ? GRE, TOEFL రాసేవాళ్ళకి చెప్పరేం ? ఈ మెట్టవేదాంతాలు? ఎందుకంటే మన దృష్టిలో తెలుగొక Slumdog కనుక. వెధవ Slumdog కి పవిత్రత ఏంటి ? నిర్దుష్టత ఏంటి? పరిశుద్ధత ఏంటి?
Friday, January 02, 2009
సచివాలయంలో భాషాదేవి పూజారులు
మాకు శ్రీ ప్రసాద్‌గారి నియతి దొఱికేలా చేసినవారు ప్రఖ్యాత రచయిత మఱియు బ్లాగావరణంలో పేరెన్నిక గన్న అభినయని బ్లాగు-కర్త శ్రీ వింజమూరి విజయకుమార్‌గారు. ఆయన జీవన్‌రెడ్డిగారి పేషీలో అధికారిగా ఉన్నారు. అలానే మనకందఱికీ తెలిసిన మదన్‌మోహన్‌గారు కూడా ఇతోధికమైన సహకారాన్ని అందించారు. ఆయన కూడా అక్కడ అధికారిగా పనిచేస్తున్నారు. వారిచ్చిన ప్రోత్సాహంతో మా కారు ఏ భద్రతా తనిఖీలూ లేకుండా ధీమాగా సచివాలయంలోకి ప్రవేశించింది. మా తరఫున ప్రవేశ చీటీలు (entry pass) కూడా అంతకుముందే వారు దయతో ఏర్పాటు చేశారు. వెళ్ళిన వెంటనే ఎదురుచూపులూ, బెదురుచూపులూ చూసే పనిలేకుండా నేరుగా శ్రీ ప్రసాద్‌గారి కార్యాలయంలోకి తీసుకెళ్ళారు. ఆయన కూడా మిక్కిలి సహృదయతతో మమ్మల్ని నిరీక్షణలో పెట్టకుండా మాకు తక్షణ ముఖాముఖీ (interview) ని దయచేశారు.
హైదరాబాద్ పుస్తక ప్రదర్శన సందర్భంగా మనం ఏర్పాటు చేసిన e-తెలుగు స్టాల్ లో తెలుగు సశక్తం గుఱించి, తెలుగులో రాయడం గుఱించి ఏదైతే సందర్శకులకి చెప్పామో అదే మఱికొంచెం విస్తరించి చెబుతూ ఆయనతో మాట్లాడ్డం జరిగింది. ఆయన అన్నారు : "మేము కూడా ప్రభుత్వ కార్యాలయాలకి ఉచిత మృదుసామానులే సరఫరా చేస్తున్నాం. అవి కూడా ఆంగ్ల మీటకాల్ని (keyboards) అనుసరించి తెలుగు టైపింగు చెయ్యడానికి అనుకూలమైనవే. సింగరేణిలాంటిచోట్ల కూడా వాటికి మంచి స్పందన వచ్చింది. అది చాలా సులభంగా ఉందని చాలామంది ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు."
మేమన్నాము : "అది కూడా ఉచితమైతే కావచ్చును సార్ !. టైపింగ్ కూడా సులభం కావచ్చును. కాదనడంలేదు. కానీ ఆ ఖతులు (fonts) అంతర్జాలానికి అంతగా ఉపకరించవు. వాటిని నకలుచేసి జాలంలో గానీ, జీమెయిల్ లాంటివాటిల్లో గాని అతికిస్తే అవి అతకవు. పిచ్చిపిచ్చి చిహ్నాలుగా మారిపోతాయి. పైగా ఆ ఖతుల్లో రూపొందించిన సాలెగూళ్ళ (websites) లోని విషయాన్ని అన్వేషా-యంత్రాలు (search engines) జాబితాకట్టి చూపించజాలవు. పైగా ఆ ఖతుల్లో టైపు చేసిన విషయాన్ని (matter) అవతలివారు చదవాలంటే వారి దగ్గర కూడా ఆ మృదుసామాను ఉండాలి. కాని యునికోడ్ అలా కాదు. తెలుగుని సశక్తం చేసుకుంటే మనం రాసిన విషయాన్ని ప్రపంచంలో ఏ కంప్యూటరైనా చదవగలదు. పైగా మేము చెబుతున్న పద్ధతిలో ఇటు దస్తావేజుల (documents) లోను, అటు జాలంలోను కూడా ఒకే ఖతిని వాడుకోవచ్చు."
ఆ మాట మీద ఆయన తమ సాంకేతిక సలహాదారుని రమ్మని కబురుపెట్టారు గాని ఆయన అంతకుముందే వెళ్ళిపోయారని తెలిసింది.
మేము కూడా ఇతర సందర్శకుల్లా ఏదో వ్యాపార ప్రయోజనంతో ప్రభుత్వాన్ని సమీపిస్తున్నవాళ్ళం కాదని చెప్పుకోక తప్పదనిపించి మొదట్లోనే స్పష్టంగా చెప్పాము : "మాది స్వచ్ఛంద సేవాసంస్థ. ప్రభుత్వం నుంచి నిధులు గానీ మఱే ఇతర తోడ్పాటు గానీ మేమాశించడంలేదు. పైసా ఖర్చు లేకుండా కంప్యూటర్‌లలో తెలుగు ఎలా ఉపయోగించాలో ప్రజలకి తెలియజెప్పడమే మా లక్ష్యం. ప్రభుత్వం అనుమతిస్తే మేము జిల్లా ప్రభుత్వ కార్యాలయాలక్కూడా మా సొంత ఖర్చులతో వెళ్ళి అక్కడ జాగృతి కలిగించడానికి సిద్ధంగా ఉన్నాము."
ఆ మాటకు ఆయన సంతృప్తిని వ్యక్తం చేస్తూ "మీ ప్రతిపాదనల్ని క్లుప్తంగా ఒక కాయితం మీద రాసి దాఖలు చేయండి. దాన్న్ని మేము ప్రక్రియాపన (process) చేస్తాం" అని హామీ ఇచ్చారు. ఎప్పటిలోగా దాఖలు చెయ్యగలరని కూడా అడిగారు. e-తెలుగు సంస్థ సమావేశం త్వరలో జరుగుతుందనీ అక్కడ సభ్యులు సదరు విజ్ఞాపనని ఖరారు చేస్తే ఒక వారం రోజుల్లో దాఖలు చెయ్యగలుగుతామనీ చెప్పి సెలవు తీసుకున్నాం.
మొత్తం మీద అతితక్కువ ఆంగ్లపదాల్ని ఉపయోగిస్తూ తెలుగు మాట్లాడే తెలుగు ప్రముఖుణ్ణి చూశామన్న ఆనందం కూడా మిగిలింది.
Sunday, November 16, 2008
భాషావాదాల కన్నా భాషాభిమానమే ముఖ్యం
భాషలోకి భాషేతర శక్తుల అక్రమ చొఱబాటు :- ఇక రెండో విధమైన అపార్ఠం ఎలా ఉంటుందంటే - అప్పటిదాకా తెలుగు సాహిత్యంలో వాడుకభాషని వాడ్డమే జరగలేదనీ, వ్యావహారికవాదులే కష్టపడి ఆ పుణ్యం కట్టుకున్నారనీ, వాడకపోవడానికి వర్గపరమయిన కారణాలున్నాయనీ, కనుక అందుకుముందు వచ్చిన తెలుగు సాహిత్యమంతా ఆధిక్యవర్గాల సామాజికదోపిడీకి మద్ధతుగా సృష్టించబడిన సాహిత్యమనీ రంగు మీద రంగు దట్టంగా పులుముతూ పోయే సిద్ధాంతవాదులు కొందరు. రంగులంటే మరీ ఎక్కువ కాదు. రెండే రెండు రంగులు. ఒకటి నలుపు, ఇంకొకటి తెలుపు. సరే ! అది వేరే గొడవ.
గ్రాంథికం కూడా మన మాతృభాషే :- తెలుగులాగానే ప్రపంచంలోని ప్రతి జీవద్ భాషకు ఒక ప్రాచీనరూపమూ, ఒక అర్వాచీన రూపమూ తప్పనిసరిగా ఉంటాయి. అయితే, ఇక్కడిలాగా ప్రాచీన రూపాల గుఱించి అవమానకరంగా మాట్లాడేవారెవరూ లేరు. మాతృభాష మీద జోకులు వేసి ఆనందించే సంస్కారహీనులం కూడా మనమే. 'తెలుగు-తెగులు' అనే ఇతివృత్తాన్ని నేను వింటూండగా ఎంతమంది ఎంగిలిచేశారో చెప్పలేను. ఈనాడు 'శక్తిమంతమైన వ్యావహారికశైలి' అని భావించబడుతున్నదంతా గ్రాంథికంలోనుంచి స్వీకరించబడినదేనని మఱువరాదు. ఆ విధంగా భాషని ఇతరభాషలతో సమానంగా సంపన్నించాలంటే గ్రాంథిక తెలుగుని కూలంకషంగా అధ్యయనం చెయ్యక తప్పదు. ఎందుకంటే అది ఒకనాటి వ్యావహారికమే కనుక, అది భావవ్యక్తీకరణల పరంగా వ్యావహారికం కన్నా సంపన్నమైనది గనుక. నిజానికి మన తెలుగురాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ ఉమ్మడిగా గల అమూల్య వారసత్వం గ్రాంథికం. అది తెలుగువారందరినీ కలపగలదు. మన మాండలికాలన్నీ గ్రాంథికం నుంచి జన్మించినవే ! ఇలా మనం మనకు సంబంధించిన ఏ విషయాన్నీ సక్రమంగా అర్థం చేసుకోకుండా చేస్తూ అడ్డుపడుతున్న మానసిక అవరోధం (mental barrier) మనలో చిరకాలంగా లోతుగా పాతుకుపోయిన మాతృభాషాద్వేషమే.
ఆత్మద్వేషపు చరిత్రకు భరతవాక్యం పలకాలి :- మొదట్నుంచీ బాషాభిమానపు విటమిన్ కొఱవడిన జాతిగా మన సమష్టిస్వభావానికి అనుగుణంగానే ఉంటాయి ఈ వాదాలు కూడా. చిత్రమేమిటంటే మనలో అన్నిరకాల దోపిడీకి వ్యతిరేకమని చెప్పుకునేవాళ్ళు కూడా తెలుగుజాతిని భాషాపరంగా ఇతరులు దోపిడీచెయ్యడం పట్ల తూష్ణీంభావం వహిస్తారు. అందుచేత మన భాషని ఉద్దేశపూర్వకంగా ఆణగదొక్కి పారేసినవాళ్ళు, దాని స్థానే తమ మాతృభాషల్ని మన నెత్తిన బలవంతంగా రుద్దినవాళ్ళు, నిస్సంకోచంగా బాహాటంగా మన భాషని మన గడ్డ మీదే నిషేధించినవాళ్ళు మనకు గౌరవనీయులయ్యారు. కాని తన మానాన తాను తనకు నచ్చిన తెలుగుశైలిలో తాను మెచ్చిన కథ రాసుకున్న తెలుగువాడు మాత్రం మనకు శత్రువయ్యాడు. ఇది కూడా మన జాతిస్వభావానికి అనుగుణంగానే ఉండడం మిక్కిలి ముదావహం. ఎందుకంటే మన ప్రతాపమంతా ఎల్లప్పుడూ తోటి తెలుగువాళ్ళ మీదే. కొన్నిసార్లు ఆ తెలుగువాళ్ళు స్వయానా మన పూర్వీకులైనా సరే !
పెను-సవాళ్ళు :- మనకు మిగతా ప్రపంచంతో సంబంధం లేకుండా మనకు మనమే ఒక లోకం అయితే బావుంటుంది. అప్పుడు ఈ అంతర్గత కలహాల్లో అందరమూ ఆనందంగా పాల్గొనవచ్చు. కాని మనకు అటువంటి ప్రాచీన దర్జా ఆకస్మికంగా నిరాకరించబడింది. ఇప్పుడు మన చుట్టూ ఒక పరాయి, నాన్-తెలుగు ప్రపంచం కనిపిస్తోంది. అది మనలాంటి వెన్నెముక లేని బాషాజాతుల్ని - అవి ఎంత పెద్ద జాతులైనా సరే - నిర్దాక్షిణ్యంగా.తొక్కెయ్యడానికి సిద్ధంగా ఉంది. గ్లోబలైజేషన్ వెల్లువలో పడి మనమూ, మన భాష, సాహిత్యమూ, వాటితో పెనవేసుకుపోయిన తెలుగు సంస్కృతి తుడిచిపెట్టుకు పోకుండా ఉండాలంటే మనం ఆత్మహత్యా సదృశమైన అన్ని ధోరణులకూ తక్షణమే స్వస్తిచెప్పాల్సి ఉంది. పూర్వీకుల్ని ప్రతి విషయంలోను విమర్శించడం ఆత్మహత్యా ధోరణులకు బీజప్రాయమైనటువంటిది. పూర్వీకులు అంత దూష్యులైతే, అటువంటి దూష్యులకు చెందిన భాష, సంస్కృతి మన సమకాలీన యువతరానికి ఎంతమాత్రమూ అవసరం లేదు. ఆ రకంగా దాన్ని వదిలిపెట్టడానికి మనమే వారికి దారిచూపిస్తున్నాం. తద్ద్వారా మనం వాళ్ళని rootless చేస్తున్నాం.
అఱకొఱ అభిమానాలకు స్వస్తి :- భాషకు చాలా అవయవాలున్నాయి. గ్రాంథికం, వ్యావహారికం, ప్రామాణిక వాడుక, మాండలిక వాడుకలు - ఇవన్నీ భాషావయవాలే. వీటిల్లో ఏది లేకపోయినా మన భాషకు చరిత్రే లేకుండా పోతుంది. మనకివి అర్థం కాకపోతే కూఢా ఇవి నశించే ప్రమాదముంది. కాబట్టి మనం అన్నింటినీ నేర్చుకోవలసిందే. మన పిల్లలక్కూడా నేర్పవలసిందే. కనుక మనకిప్పుడు కావలసింది మన భాషలోని ఏ అవయవాన్నైనా వదిలించుకోవడం కాదు, అన్ని అవయవాల్నీ సలక్షణంగా బతికించుకోవడం. ఏ అవయవాన్నైనా దుమ్మెత్తి పోయడం కాదు, మన యొక్క ప్రతి భాషావయవం పట్ల ముందు మనం మనలో గౌరవాభిమానాల్ని పెంపొందించుకుని తరువాత అదే విధమైన గౌరవాభిమానాల్ని ఇతరుల్లో కూడా కలిగించడానికి ఉద్యుక్తులం కావడం. మన ఆలోచనా వాతావరణాన్ని (Climate of thought) అందుకనుగుణంగా మార్చుకోవాలి. మన విద్యావిధానాన్ని సైతం అలా తీర్చిదిద్దుకోవాలి. ఇంగ్లీషు ఈనాడు అంతర్జాతీయ భాష అయిందంటే అదేదో మాయగా, మంత్రంగా జరిగింది కాదు. ఇంగ్లీషువాళ్ళు మనలా మాతృభాషాభిమానం లేనివాళ్ళయితే అది జరిగేది కాదు. అ భాషని ఇతరప్రాంతాల్లో విధించక ముందు అది కేవలం ఇంగ్లండుకు పరిమితమైన ఒక ప్రాంతీయభాషగా ఉండేదని మఱువరాదు. కాని అది ఇంట గెల్చి రచ్చ గెల్చింది. దాన్ని ఇంగ్లండులో అన్ని జీవనరంగాల్లోను విస్తృతంగా అమలు జరిపాకనే అది ప్రయోజకంగా మారింది.
బలమా ? బలహీనతా ? :- ఇతరభాషల్ని తెలుగుతో పోల్చి వాటిని విమర్శిస్తే మనవాళ్ళు సహించరు. కాని తెలుగుని ఇతరభాషలతో పోల్చి దాన్ని ఎగతాళి చెయ్యడంలో మాత్రం ముందుపీటీన నిలబడతారు. పరభాషా విధేయత మనలో అణువణువునా అలా ఇంకిపోయింది. ఇందుకు మన భాషే కొంతవఱకు కారణమనిపిస్తుంది. తెలుగులో రాయలేని, తెలుగువాళ్ళు పలకజాలని పరభాషా పదమంటూ దాదాపుగా ఏదీ లేదు. అందువల్ల తెలుగువాళ్ళు ఇతరభాషల్ని సులువుగా నేర్చుకోవడానికి దో్హదిస్తున్నది తెలుగుభాషే. కాని చివరికి అదే దాని కొంపముంచుతోంది. ఇందుకు విరుద్ధంగా తమ భాష తప్ప ప్రపంచంలో ఇంకేదీ పలకలేనివాళ్ళు మాతృభాష విషయంలో మహాపట్టుదలగా ఉంటున్నారు. మనలో కొందఱికి పరభాషా వ్యామోహం ముమ్మరంగా ముదిరిపోయి ఎటువంటి ఉన్మాదం సంప్రాప్తించిందంటే - తెలుగుభాష యొక్క సద్గుణాల్ని దుర్గుణాలుగా, దాని ధనాన్ని దరిద్రంగా భావించే స్థితిలో ఉన్నారు. వారి దృష్టిలో తెలుగులో సగం అక్షరాలు అనవసరం. ఏ భాషని ఆ భాష దృష్టితోనే చూడాలనే విషయాన్ని తెలుగు దగ్గరికొచ్చేసరికి చాలా సులభంగా మర్చిపోతారు.
మాతృభాషా విధేయత :- మన మనస్సులలో మాతృభాషా విధేయతని ఆచ్ఛాదించి మసకబాఱుస్తున్న అన్నిరకాల ఇతర విధేయతల్నీ నిర్ ద్వంద్వంగా త్రోసిపుచ్చక తప్పదు. అవి మన: కాలుష్యాలే తప్ప మఱింకేమీ కాదు. సైద్ధాంతిక, ప్రాంతీయ, కుల, మత, దేశ విధేయతల కంటే భాషా విధేయతే జాతికి జీవిత బీమా పాలిసీ అని నేను దృఢంగా నమ్ముతాను. సమకాలీనంగా ఎన్ని విభేదాలున్నప్పటికీ జాతిని ఏనాటికైనా ఒకటిగా కలపగలిగేది అంతిమంగా మాతృభాష మాత్రమే. అది నశిస్తే అన్నీ నశిస్తాయి. అది మనతో సహా ఎవరికీ అర్థం కాకుండా పోయిన రోజున ప్రాంతం ఉండదు, సిద్ధాంతం ఉండదు, మతం ఉండదు, కులం ఉండదు. ఒక జాతిని నాశనం చెయ్యడానికి ఆ దేశం మీద అణుబాంబుల్ని వర్షించ నక్కఱలేదు. వాళ్ళ భాషని నాశనం చేస్తే చాలు, వాళ్ళు కిక్కురుమనకుండా, చరిత్రలో నామరూపాల్లేకుండా నశించిపోతారు. హరప్పా, మొహెంజదారో నగరాల నాగరికత ఎందుకు నశించిందో సరిగా తెలియదు. కాని వాళ్ళ భాష మనకు తెలియకపోవఢాన ఆ ప్రజలెవరో, ఆ సంస్కృతి ఏంటో మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. తద్విరుద్ధంగా సంస్కృతభాషాప్రజలు ఈనాడు మన మధ్య లేకపోయినా, వాళ్ళ గుఱించి మనకు చాలా చాలా ఎక్కువ తెలుసు, వాళ్ళ భాష ఈనాటికీ మనకర్థమవుతోంది గనుకనే.
శాస్త్రవిధేయతలు :- భాషాశాస్త్రాన్ని కూడా, అది మన భాషాభివృద్ధికి ఎంతవఱకు ఉపకరించగలదో, అంతవఱకే గంభీరంగా పట్టించుకోవాలి. భాష కన్నా భాషాశాస్త్రం మహనీయమైనది కాదు. కాని ఇందుకు వ్యతిరిక్తంగా కొందఱు భాషాశాస్త్ర అధ్యయనంలో మునిగిపోయి అంతకుముందు తమలో ఉన్న భాషాభిమానాన్ని సైతం నిశ్శేషంగా కోల్పోయి పరిపూర్ణ భాషా వేదాంతులుగా, భాషా సన్యాసులుగా అవతరిస్తారు. కాలానుగతమైన భాషా పరిణామాల్ని నిర్మమంగా అంగీకరించే పేరుతో భాషకు జరుగుతున్న అన్యాయాలన్నింటినీ మౌనసాక్షులుగా వీక్షించే నిష్క్రియాపరత్వాన్ని వారు కౌగలించుకుంటారు. ఇది అనుష్ఠానపరంగా మెట్టవేదాంతమే తప్ప దీర్ఘకాలికంగా జాతికి ఉపకరించే వైఖరి కాదు. అందుచేత భాషాభిమానులు భాషాశాస్త్రవాదాల నుంచి సముచితమైన దూరాన్ని పాటించడం వాంఛనీయం. ఒకవేళ మనం ఇప్పటికే భాషాశాస్త్రవేత్తలమైతే, ముందు మనలోని 'వేత్త' ని బోషాణంలో పెట్టి తాళంవేసి మాతృభాషా పరిరక్షణకై, దాని వ్యాప్తికై పునరంకితం కావడం అవసరం.
మన ముందున్న తక్షణ కర్తవ్యం - ఏం చేసైనా సరే, మన భాషని కాపాడుకోవడం. పాచి వాదాల్ని, ఉద్యమాల్నీ మళ్ళీ తలకెత్తుకోవడం కాదు.
Saturday, September 20, 2008
ఒకరి గుఱించి పట్టించుకోవద్దు
"భాష మీకేం అపకారం చేసిందయ్యా ?" అంటాను నేను. ఏ పదమూ నీ అబ్బసొత్తూ కాదు. నా తాత సొమ్మూ కాదు, "వాడు వాడే పదం నేను వాడ"నని మొండికెయ్యడానికి. తెలుగుభాష అనేది తెలుగు పదం గూగుల్ గుంపు సభ్యుల మూటాముల్లే కాదు. లేదా తెలుగు అకాడమీవాళ్ళ ఆస్తి అంతకంటే కాదు. అన్నీ తెలుగే. అందఱికీ బాధ్యత ఉంది. అందఱూ అన్ని తెలుగు పదాల్నీ ప్రేమించవలసిందే, వాడినా, వాడకపోయినా ! ఎందుకంటే అది తెలుగు, అది మనది, మనందఱిదీను.భాష కూడా గాలి, నీరు వంటిదే. "పక్కవాడు పీల్చిన గాలి నేను పీల్చను" అంటే అది ఎంత హాస్యాస్పదమో, "పక్కవాడి పదాలు నేను వాడ"ననడమూ అంతే హాస్యాస్పదం. ఒకే సమాజంలో జీవిస్తున్నప్పుడు ఇలాంటివి సాధ్యపడవు. నేను పుట్టుకతో కోస్తావాణ్ణయినా తెలంగాణవారి కోసం కొన్ని తెలంగాణ పదాలు నేర్చుకుని వాడతాను. తప్పేముంది ? అదీ తెలుగే.
ఇక్కడెవరూ కొత్త పదాల్ని కనిపెట్టడంలేదు - అంతగా దు:ఖించడానికి ! ఇప్పటికే ఉనికిలో ఉన్న పదాలనే వాడుతున్నాం. అవి ఉన్నాయని కొంతమందికి తెలియక పోవడం ఆ పదాల తప్పు కాదు. అవి ఏ పాపమూ ఎఱగవు. మనం ఇప్పుడు వాడుతున్న ప్రామాణిక తెలుగులో చాలా భాగం నిఘంటువుల్లోంచి, వ్యాకరణాల్లోంచి పునరుద్ధరించబడిన తెలుగే. మన పూర్వీకుల దైనందిన వ్యవహారంలో ఈ భాష లేదు. అలా అవసరాన్ని బట్టి, ఇంగ్లీషుకు దీటుగా ఎన్నో పదాల్ని పునరుద్ధరించుకుని వాడుకుంటున్నాం. ఈ పునరుద్ధరణ కార్యక్రమంలో కొంత పాత్రికేయులు చేశారు. మఱికొంత పాఠ్యపుస్తకాల రచయితలు చేశారు. ఇప్పుడు మనం ఇంకొంత చేస్తున్నాం. అలా 'తెలుగుపదం, తెలుగు బ్లాగు' గూగుల్ గుంపుల్లో చాలా పాతపదాలకు వేఱే (ఆధునిక) అర్థాన్ని కల్పించి పునరుద్ధరించడం జరిగింది. వాటిల్లో ఈ "నెనర్లు, ఖతి" మొదలైనవి చాలా ఉన్నాయి. అంతమాత్రానికి ఆ అమాయక తెలుగు పదాల మీద కొందఱు అకారణంగా నిగ్రహం లేకుండా, తామేం మాట్లాడుతున్నారో తమకే తెలియని విధంగా కక్కిన విషం చాలా బాధించింది.
మన భాషాజ్ఞానమంతా ఇతరుల నుంచి నేర్చుకున్నదే అయినప్పుడు ఒక ఎల్లాయో పుల్లాయో సూచించాడన్న కారణం చేత కొన్ని పదాలు అస్పృశ్యాలయిపోతాయా ? ఇతరులు సూచించిన ఎన్నో పదాల్ని నేను ఇప్పుడు నా వ్యాసాల్లో వాడుతున్నాను. వాటిని నా "కలగూరగంప" బ్లాగు మార్జిన్ లో ప్రదర్శనకు పెట్టాను కూడా ! వాటిల్లో నాకు నా తెలుగుతల్లే దర్శనమిస్తుంది. వాటిని సూచించినవారు కనిపించరు.
సమాజం ప్రతి కొత్త విషయాన్నీ ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంటుందనడానికి ఇంతకన్నా మంచి దృష్టాంతం లేదేమో ! వీరేశలింగం గారికి తప్పలేదు. గిడుగు రామమూర్తిగారికి తప్పలేదు. ఇక తెలుగుపదం గుంపు సభ్యులనగా ఎంత ? కానీ మన బ్లాగావరణంలో ఉన్న తెలుగు భాషాభిమానులు ఈ తాటాకు చప్పుళ్ళకు చలించకూడదు. తెలుగు పదాల వాడకాన్ని మానకూడదు. "వాడం" అన్నవారిని వారి మానాన వారిని వదిలేద్దాం. మన దారిన మనం కమ్మగా అచ్చ తెలుగు పదాలే వాడుకుందాం. మనకు వారి నుంచి యోగ్యతా పత్రాలూ, సన్మాన పత్రాలూ అవసరం లేదు. ప్రపంచం అంటే బ్లాగావరణం ఒక్కటే కాదు. ఇంకా చాలా ఉంది. "కాలో హ్యయం నిరవధిర్విపులా చ పృథ్వీ" ఈ లోకంలో ప్రతి ఒక్కరినీ మెప్పించడానిక్కాదు గదా, మనం పుట్టింది ?
Sunday, August 12, 2007
(Verbification Tools in Telugu)
తెలుగు ఉపసర్గలు
1. అలియన్ + పల్కు = అలవల్కు = (మళ్ళీ మళ్ళీ పలుకు) వాదించు
2. విడన్ + పల్కు = విడబల్కు = (విడగొట్టి పలుకు) వివరించు
3. అకన్ + పల్కు - కాబల్కు = (అయ్యే విధముగా చెప్పు) జోస్యము చెప్పు
4. రాన్ + పల్కు = రాబల్కు = (వచ్చే విధముగా పలుకు) ఆహ్వానించు
5. (కవ అంటే జంట) కవన్ + కలుపు = కలుపు = కౌగల్పు (కౌగలించు లాగా) అనుసంధానించు
వీటినే నామవాచకాలుగా కూడా యథాతథంగా ప్రయోగించవచ్చు.
(ii) ఉపసర్గలుగా విభక్తి ప్రత్యయాలు :
విభక్తి ప్రత్యయాల్ని ఉపసర్గలుగా వాడుకునే సౌలభ్యమొకటి తెలుగులో ఉంది.విభక్తి ప్రత్యయాలంటే నామవాచకాలకు చివర వచ్చే తోన్, లోన్, పై, క్రీ (క్రిందు), మీన్ (మీదు) మొదలైనవి.
ఉదా:- తోన్ + పుట్టువు = తోబుట్టువు (కలిసి పుట్టినవాడు)
పైన్ + చరిమి = పైసరము ( పైకి జరుగుట - స్త్రీతో కలయిక)
క్రిన్ + కంటి = క్రీగంటి
మీన్ + కట్టు = మీగడ
మీదు + కట్టు = మీదుకట్టు, ముడుపుకట్టు to pledge
లోన్ + గుట్టు = లోగుట్టు
లోన్ + కొను + లోగొను (లొంగునట్లు చేసుకొను)
లోన్ + పడు = లోబడు (లొంగు)
లోన్ + పఱచుకొను (లోబఱచుకొను)
(iii) ఉపసర్గలుగా నామవాచకాలు
కవన్ + కలియించు = కవంగలించు --> కౌగలించు (తన జంటగా చేరేలా చేయు)
నామవాచకాన్ని క్రియాధాతువుతో కలిపి ప్రయోగించే ఇలాంటి ఉదాహరణల్ని "శబ్దపల్లవాలు" అంటారు.కాని కొన్నిసార్లు వీటిల్లో మొదటి పదం మనకు ఉపసర్గగా ఉపయోగపడుతుంది.
కొన్ని శబ్దపల్లవాలు :
ఉరితీయు
వలవిసురు
కన్నుమూయు
గురిపెట్టు
చేపట్టు
దారితీయు
దారిపట్టు
మనసుపడు
మన్సగు
తెఱదించు
మిన్నంటు
గాలిసోకు
మఱికొన్ని ఉపసర్గలు :
కొన్ని పదాలు ప్రాచీనకాలంలో విశేషణాలుగా ఉండి తరువాత్తరువాత ఉపసర్గల్లా ప్రవర్తించడం మొదలుపెట్టాయి.
ఉదా:- మరు + నాడు = మరుచటి నాడు
పెద + తల్లి = పెత్తల్లి
చెన్ను + కలువ = చెంగలువ మొ.
ఉపోద్ఘాతం : సంస్కృతం, ఇంగ్లీషు భాషల తరహాలో పదాలకు ముందు చేర్చదగిన ఉపసర్గలు (prefixes)తెలుగులో లేవు. కారణం-తెలుగుభాష, పదం పక్కన పదం/ప్రత్యయం చేరే టర్కిష్ మొదలైన భాషల కోవకు చెందినది. ఈ రకం భాషల్లో పదాలకు ముందు కాక తరువాత ప్రత్యయాలు చేరతాయి.
(i) ఉపసర్గలుగా తుమున్నంతాలు :
అయితే తెలుగులో అచ్చం ఉపసర్గల్లాగానే ప్రవర్తించే పదాలున్నాయి. ఈ క్రింది ఉదాహరణలు పరిశీలించండి :
ఎగన్ + తీయు = ఎగదీయు
దిగన్ + తీయు = దిగదీయు
అలియన్ + బడు = అలబడు --> అలవడు --> అలవాటు
అలియన్ + పోవు = అలబోవు --> అలబోక --> అలవోక
తడియన్ + పడు = తడబడు --> తడబాటు
పొఱియన్ + పడు = పొఱబడు --> పొఱబాటు
ఎడయన్ + పడు = ఎడబడు --> ఎడబాటు
ఒడియన్ + పడు = ఒడబడు --> ఒడబాటు
కలియన్ + పడు = కలబడు
కలియన్ + చూచు = కలియజూచు --> కలజూచు
అకన్ + చేయు = కాజేయు
పోవన్ + పడి = పోవబడి --> పోబడి
పోవన్ + కాలం = పోవగాలం --> పోగాలం
పెనగన్ + వేయు = పెనవేయు (పేనేట్లు వేయు)
పెనగన్ + కొను = పెనగొను (పేనుకొను) పైన ఫలితార్థంగా చూపించినవి ఇప్పుడు అందరికీ తెలిసిన శబ్ద స్వరూపాలు. సంధులుగా చూపించినవి ఆ స్వరూపాల మూలరూపాలు.వీటిని పరిశీలించినప్పుడు క్రియాధాతువుల తుమున్నంతాలే తెలుగులో ఉపసర్గల్లా ప్రవర్తిస్తాయని అర్థం చేసుకుంటాం. తుమున్నంతాలంటే - చెయ్యడానికి, పోవడానికి, చేయుటకు, పోవుటకు అని అర్థమిచ్చే క్రియారూపాలు. ఇవి ప్రాచీన తెలుగులో చేయన్, పోవన్, అనన్ అనే విధంగా ఉంటాయి. తుమున్నంతాలు పై అర్థాన్నే కాకుండా "చేసేలా పోయేలా" అనే విధంగా కూడా అర్థాన్నిస్తాయి.
ఉదా:- పోవన్ + కొట్టు = పోవగొట్టు --> పోగొట్టు = పోయేలా కొట్టు
చావన్ + కొట్టు = చావగొట్టు (చచ్చేలా కొట్టు)
లేవన్ + కొట్టు = లేవగొట్టు (లేచేలా కొట్టు) to evict somebody forcibly
నిజానికి ఈ నిర్మాణాలు క్రియాగుచ్ఛాలనే రకానికి చెందుతాయి.తెలుగులో క్రియ మీద క్రియ దండలాగా చేరే సౌలభ్యం ఒకటుంది.ఇతర భారతీయ భాషల్లో కూడా ఉందనుకోండి.కాని తెలుగులో ఉన్నంత విస్తారం కాదు.
ఉదా:-
1. పట్టుకోలేకపోయాడు (ఇందులో పట్టు, కొను, ఉండు-వ్యతిరేకార్థకం, పోవు అనే ధాతువులున్నాయి)
2. పడగొట్టగలడు (పడు + కొట్టు + కలుగు)
మనం తెలుగులో ఉపసర్గల్ని కల్పించాలంటే ముందు ఇలాంటి క్రియాగుచ్ఛాల్ని కల్పించాలన్నమాట. ఈ సందర్భంగా కొన్ని అంశాల్ని గమనంలో ఉంచుకోవాలి:
(అ) తెలుగు ఉపసర్గలు తుమున్నంతాలై ఉండాలి.
(ఆ) అవి తెలుగులిపిలో గరిష్ఠంగా మూడు అక్షరాలకు మించనివై ఉండాలి.
(ఇ) అవి ప్రసిద్ధ అర్థాన్నే కాక సంబంధిత వ్యంగ్యార్థాన్ని సైతం ఇవ్వాలి. అంటే ఒకే ఒక్క నిశ్చితార్థాన్ని ఇచ్చే విధంగా ప్రయోగించకూడదు.
(ఈ) ఉపసర్గల్ని ఏర్పఱిచే క్రమంలో పనికొస్తాయనుకున్న పాత ధాతువుల్ని సైతం పునరుద్ధరించడానికి వెనుకాడకూడదు.
(ఉ) క్లుప్తత నిమిత్తం అక్షరాల్ని కుదించడానికి అనుమతించాలి.
ఉదా: పొఱియన్ + పడు = పొఱబడు
(ఊ) సంస్కృతంలో లాగా తెలుగులో ఉపసర్గ మీద ఉపసర్గ చేర్చడం సాధ్యపడదు.
(ఎ) ఉపసర్గల్ని స్వతంత్రపదాల్లా ప్రయోగించకూడదు. అలా ప్రయోగిస్తే అవి నామవాచకాలవుతాయి. ప్రతి నామవాచకానికీ ఒక ఖచ్చితమైన అర్థం ఉంటుంది కనుక ఉపసర్గ సహిత పదాల అర్థంలో అవి చెడ్డజోక్యాన్ని కలిగించుకుంటాయి.
(Verbification Tools in Telugu)
బహువ్రీహిలో పదసమ్మేళనాలు (combinations) స్థూలంగా మూడు రకాలుగా ఉంటాయి.
1. నామవాచకం + నామవాచకం
ఉదా:-శూలపాణి - శూలము పాణియందు గలవాడు
2. విశేషణం + నామవాచకం
ఉదా:- ఆర్‌ద్ర హృదయుడు - తడిసిన/చల్లని హృదయం గలవాడు
3. క్రియావిశేషణం (past/present participle) + నామవాచకం
ఉదా:- నతగాత్రుడు - వంగిన గాత్రం (శరీరం) గలవాడు.
1. సమయ పాలన - సమయపాలించు
2. వ్యాసరూపం - వ్యాసరూపించు (అలాగే, గద్యరూపించు - paraphrasing)
3. లిప్యంతరం - మరో లిపి లిప్యంతరించు - మరో లిపిలోకి మార్చు
4. ఉరిశిక్ష - ఉరిశిక్షించు - ఉరివేసి శిక్షించు
5. క్రమశిక్షణించు - క్రమశిక్షణలో పెట్టు (to discipline somebody)
6. ముంతేదించు - ముందటి తేదీ వేయు (pre-date)
7. మరుతేదించు - మరుసటి తేదీ వేయు (post-date) మొ.
బహువ్రీహితో కూడా మనం ఇలాంటి ప్రయోగాలు చెయ్యొచ్చు.
1. హతాశుడు - హతాశించు - నిరాశించు, నిరాశపరచు (to frustrate)
2. (వారసించు - వరసుడుగా చేయు x ) అవారసించు - వారసత్వానికి అనర్హుడుగా చేయు disinherit) అలాగే, నిర్వారసించు - వారసులు లేకుండా చేయు
3. దృఢదీక్షిల్లు - గట్టి పట్టుదల పట్టు (సకర్మకంగా అయితే-దృఢదీక్షించు-గట్టి పట్టుదల పట్టేలా చేయు)
4. కృతనిశ్చయిల్లు - కృతనిశ్చయుడు/రాలు అగు (సకర్మకంగా అయితే-కృతనిశ్చయించు - గట్టి నిర్ణయం తీసుకునేలా చేయు)
5. వేగవంతించు - వేగిరపఱచు (to expedite, to accelerate)
ఉప + దశ = పదికి దగ్గరగా (9 కావచ్చు, 11 కావచ్చు)
దీన్నుంచి మనం నిష్పాదించగల క్రియాధాతువు : ఉపదశించు - పదికి దగ్గరగా పూర్ణాంకం వేయు (round figure చేయు)
ఇదే క్రమంలో ఉపశతించు (వందకు దగ్గరగా)
ఉపసహస్రించు (వెయ్యింటికి దగ్గరగా)
ఉపాయుతించు (పదివేలకు దగ్గరగా)
ఉపలక్షించు (లక్షకు దగ్గరగా)
ఉపకోటించు (కోటికి దగ్గరగా)
ఉపశతకోటించు (బిలియనుకు దగ్గరగా) మొ.
వచ్చే టపాలో అచ్చతెలుగు ఉపసర్గల గురించి.....
(Verbification Tools in Telugu)
ఉదా :- దుర్ + అలవాటు = దురలవాటు = దురభ్యాసం
ని: + సిగ్గుగా = నిస్సిగ్గుగా (నిర్లజ్జగా)
ని: + మొహమాటంగా = నిర్మొహమాటంగా (మొహమాటం లేకుండా)
అతి + తిండి = అతితిండి
ప్రతి + వాడు = ప్రతివాడూ
ని: + పూచీ మనిషి = నిష్పూచీ మనిషి (బాధ్యతారహితుడు)
ని: + పేచీ ఆస్తి = నిష్పేచీ ఆస్తి ( చట్టపరమైన పేచీలు గొడవలూ లేని నిర్వివాద ఆస్తి)
సమ్ + కూడు = సమకూడు
సమ్ + కూర్చు = సమకూర్చు
సకృత్తే అయినప్పటికీ విశేషాన్ని సామాన్యీకరించే (generalizing the particular) న్యాయం చొప్పున ఈ అరుదైన పదాల శైలిని ఇతర తెలుగు పదాలకు సైతం విస్తరించాలి.ఈ క్రిందివి నేను నిష్పాదించినవి.
అవ్యయీభావ సమాసాల ద్వారా క్రియాపదాల నిష్పాదన :- సంస్కృతంలో ఉపసర్గల్ని prepositions లాగా ఉపయోగించే పద్ధతి ఒకటుంది.ఈ క్రింది సాంప్రదాయిక ఉదాహరణల్ని పరిశీలించగలరు.
1. ఉప + హరి = ఉపహరి (హరికి దగ్గరగా/హరికి దగ్గరగా ఉన్నటువంటిది)
2. అధి + గంగా = అధిగంగమ్ (గంగ వద్ద/గంగ వద్ద ఉన్నటువంటిది)
3. మధ్యే + మార్గమ్ = మధ్యేమార్గమ్ (దారి నడుమ/దారి నడుమ ఉన్నటువంటిది, జరిగినటువంటిది)
4. ప్రతి + రామ: = ప్రతిరామమ్ (రాముని గురించి/రాముని కొఱకు వ్రాసినది)
ఉదా:- అపమార్గించు = తప్పుదోవ పట్టించు (hijack)
అవనావించు/అవనౌకించు - నావలో నుంచి దిగు (disembark)
అనురూపిల్లు = conform (అనురూపత = conformity)
సఫలిల్లు = ఫలించు/సఫలమగు
సఫలించు = విజయవంతం చేయు
స్వస్థలించు = స్వస్థలానికి పంపు (repatriate)
పరాయించు = పరాయిగా చేయు (alienate) మొ.
(Verbification Tools in Telugu)
కాలక్రమంలో ఈ కింది పదాల్ని కూడా ఉపసర్గలలా వాడడం మొదలుపెట్టారు.
1. కు - కొంచెం, చిన్న, తక్కువ, నీచం, హీనం, చెడ్డగా
ఉదా :- కుభోజనం (తక్కువ తినడం)
కుగ్రామం (hamlet) మొ.
2. సకృత్ - అరుదుగా (అసలు అర్థం - ఒక్కసారి అని)
3. ఆరాత్ - దగ్గరగా
4. పశ్చాత్ - తరువాత, వెనుక
5. సహ - కలిసి
6. పునస్/పునర్ - మళ్ళీ
7. సాక్షాత్ - ఎట్టెదుట
8. సదా - ఎల్లప్పుడూ
9. శశ్వత్ - శాశ్వతంగా
10.పురస్/పురో - ముందు
11.తిరస్/తిరో -వెనుక
12.ప్రాక్ - అంతకుముందు/ఇంతకుముందు, తూర్పుదిక్కు
ఉదా :- ప్రాక్-నన్నయ యుగం (pre-Nannaya period)
ప్రాచీనుడు - ముందటివాడు
ప్రాక్తనం - ప్రాచీనం
13. అర్వాక్ - ఇంతకు తరువాత
ఉదా :- అర్వాక్ నన్నయ యుగం (post-Nannaya period)
అర్వాచీనుడు - తరువాతివాడు
14.సమ్యక్ - సరిగా సమీచీనం - సరిగా ఉన్నటువంటిది.
15.ఉపరి - పైన
16.అధస్/అధో/న్యక్ - కింద
17.ద్రాక్ - త్వరగా
18.శనైర్/శనైస్ - నెమ్మదిగా (slow)
19.ఉచ్చైర్/ఉచ్చైస్ - బిగ్గరగా (loudly)
20.బహు/నానా - ఎక్కువగా, ఎక్కువ
21.మనాక్/కించిత్/ఈషత్ - తక్కువగా, కొంచెం
22.సద్యస్/సద్యో - వెనువెంటనే (immediately)
23.తథ్యం - నిజంగా 24.మృషా - అబద్ధంగా
25.ధ్రువం/నూనం/అవశ్యం - తప్పకుండా (sure)
26.ప్రాయో - తఱచుగా (oft, often)
27.బహిర్/బహిస్ - బయట
28.అంతర్/అంతస్ - లోపల
29.యుగపత్/ఏకదా - రెండూ ఒకేసారిగా (simultaneous)
ఆ ధాతువులకు ముందు ఉపసర్గల (prefixes)ని చేర్చడం తెలిస్తే క్రియాధాతువుల కల్పనలో మనం సగం దూరాన్ని అధిగమించినట్లే.ఈ పని చెయ్యడానికి మీరొక పెద్ద వైయాకరణ శిరోమణి కావాల్సిన పని లేదు.ఇది చాలా సులభం. మన తెలుగువాళ్ళందరికీ సుపరిచితం కూడా.
తెలుగులోని చాలా క్రియాధాతువుల ముందు ఇప్పటికే వాడుతున్న ఉపసర్గల్ని వాటి అర్థాల్ని పరిశీలించండి.అవి ప్రాథమికంగా 20.అయితే కాలక్రమేణ తరువాత్తరువాత ఇంకొన్ని పదాలు కూడా ఉపసర్గల్లా ప్రవర్తించడం (క్రియాధాతువులకు ముందొచ్చి చేరడం) మొదలుపెట్టాయి.
1. అప - తప్పుడుగా, మినహాయింపుగా, వేరే దారిలో
2. ఉప - అనుకూలంగా, సుఖంగా, మంచిగా, దగ్గరగా
3. అభి - ఎదురుగా
4. అవ - తక్కువగా
5. అతి - దాటి, మించి, మీరి
6. అను - వెనువెంటనే, తరువాత, అనుసరించి, పోలి ఉండే విధంగా
7. ఆ - మొదటి నుంచి చివరి దాకా
8. ని - లోపల (ని + ద్రా = తన లోపలికి తానే పరుగెత్తడం)
9. నిర్/నిస్ - బయటికి, లేకుండా
10.అధి - మీద, పక్కన
11.సు - మంచిగా, చక్కగా, నేరుగా
12.దుర్/దుస్ - చెడ్డగా
13.ప్ర - గొప్పగా
14.ప్రతి - ప్రత్యామ్నాయంగా, విరోధంగా, ఎదురుగా, తిరిగి, ఒక్కొక్కటి
15.వి - వేరుగా, లేకుండా, మరో విధంగా, మరో దిశలో
16.సం - కలిసి, మొత్తంగా, ఉత్తమంగా
17.పరా - అవతల
18.పరి - చుట్టూ
19.పి/అపి - రహస్యంగా, కప్పి ఉంచి
20.ఉత్/ఉద్ - పైకి
మనం మూడు రకాల పదాల్ని కల్పించాల్సి ఉందని ఇదివరకటి ఒక చర్చాహారం(thread)లో అనుకున్నాం.వాటిల్లో మొదటి విభాగం క్రియాధాతువులు.ఏ భాషలో నైనా ప్రాథమిక క్రియలు కొన్నే ఉంటాయి.మిగతా క్రియలన్నీ నామవాచకాల(nouns)ని విశేషణాల్ని(adjectives)రూపాంతరించగా ఏర్పడ్డవై ఉంటాయి.ఇలా క్రియల్ని కల్పించడానికి తెలుగుభాష అందిస్తున్న సౌకర్యాల గురించి మనం ఇప్పుడు చర్చిస్తున్నాం.
తెలుగులో క్రియా ధాతువులు అంతమయ్యే విధానాన్ని ముందు అధ్యయించాలి.
1. "చు" తో అంతమయ్యే రెండు అక్షరాల క్రియాధాతువులు.ఉదా :- కాచు, గీచు, చాచు, తోచు, దాచు, దోచు, పాచు, రాచు, వాచు, వీచు, వేచు మొదలైనవి.
2. అనుస్వార పూర్వకమైన (సున్నా ముందు గల)"చు" తో అంతమయ్యే రెండు అక్షరాల క్రియాధాతువులు. ఉదా :- దంచు, దించు, తెంచు, మించు, ఉంచు, ఎంచు, పంచు, వంచు మొదలైనవి.
3. ద్విరుక్త (వత్తు) "చు" తో అంతమయ్యే రెండు అక్షరాల క్రియాధాతువులు :- ఉదా :- తెచ్చు, గుచ్చు, నచ్చు, నొచ్చు, పుచ్చు మొదలైనవి.
4. "చు" తో అంతమయ్యే మూడు అక్షరాల క్రియాధాతువులు. ఉదా :- నడచు, ఒలుచు, పొడుచు, విడచు మొదలైనవి
5. "ఇంచుక్" ప్రత్యయంతో అంతమయ్యే అచ్చతెలుగు క్రియాధాతువులు. ఉదా :- గురించు (addressing), ఆకళించు (explain), సవరించు (amend), సవదరించు (edit) మొదలైనవి.
6. "ఇంచుక్" ప్రత్యయంతో అంతమయ్యే ప్రేరణార్థక క్రియా ధాతువులు. ఉదా :- చేయించు ("చేయు" కు ప్రేరణార్థకం) కదిలించు ("కదులు" కు ప్రేరణార్థకం) మొదలైనవి.
7. "ఇంచుక్" ప్రత్యయంతో అంతమయ్యే తత్సమ (సంస్కృత/ప్రాకృత)క్రియా ధాతువులు (ఇవి లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి) : ఉదా :- ధరించు, బోధించు, సంహరించు మొదలైనవి.
8. "యు" తో అంతమయ్యే రెండు అక్షరాల క్రియాధాతువులు. ఉదా :- ఏయు, కాయు, కోయు, కూయు, డాయు, తీయు (తివియు), తోయు, మోయు, మ్రోయు, వేయు మొదలైనవి.
9. "యు" తో అంతమయ్యే మూడు అక్షరాల క్రియాధాతువులు. ఉదా :- తడియు, వడియు, జడియు, అలియు, తెలియు, పులియు, ఉమియు, విరియు మొదలైనవి.
10. "ను" తో అంతమయ్యే క్రియాధాతువులు. ఉదా :- తిను, కను, విను, మను, అను, చను, కొను మొదలైనవి.
11. సామాన్య క్రియా ధాతువులు. ఉదా :- సాగు, వెళ్ళు, అదురు వదులు, పగులు, మిగులు మొదలైనవి.
12. విశేష క్రియా ధాతువులు (special verbs). ఉదా :- ఉండు, పోవు, చూచు, అగు, వచ్చు, ఇచ్చు, చచ్చు మొదలైనవి.
మరొక విషయం :- తెలుగులో క్రియలు రెండు విధాలుగా ఉంటాయి. 1.సకర్మక క్రియలు (transitive verbs) 2. అకర్మక క్రియలు (intransitive verbs)
సూత్రం -1. సకర్మక క్రియలకు మాత్రమే చివర "ఇంచుక్" ప్రత్యయం వస్తుంది.
ఉదా :- ధరించు : ఆయన కిరీటం ధరించాడు. (ఇక్కడ ధరించు అనే క్రియకు కిరీటం కర్మ కనుక ఇది కర్మ గలిగిన సకర్మక ధాతువు)
సూత్రం-2. అకర్మక క్రియలకు చివర "ఇల్లుక్" వస్తుంది. ఉదా :- ఆమె హృదయేశ్వరిగా విరాజిల్లింది. (ఈ వాక్యానికి కర్మ లేదు కనుక "విరాజిల్లు" అకర్మక ధాతువు)
కాబట్టి మనం ఇంచుక్ బదులు ఇల్లుక్ చేర్చడం ద్వారా సకర్మక ధాతువుల్ని అకర్మక ధాతువులుగా మార్చడానికి తెలుగుభాష అవకాశం కల్పిస్తోంది. దీన్ని ఇలా అర్థం చేసుకోవచ్చు.
ఇంచుక్ = చేయు
ఈ మార్గంలో కల్పించదగిన కొన్ని పదాలు : సన్నగిల్లు - సన్నగించు (సన్నగా అయ్యేలా చేయు) పరిఢవించు - పరిఢవిల్లు తొందఱించు - తొందఱిల్లు మొదలైనవి.
ఇంకా చాలా విషయాలు రాబోయే టపాలలో....
వ్యక్తినామాల (proper nouns)ని సైతం క్రియలుగా మార్చేశారు. Charles F. Boycott అనే బ్రిటిష్ భూస్వామి అడిగినంత కూలీ ఇవ్వట్లేదని ఆయన ఎస్టేట్లో పనిచేసే రైతుకూలీలంతా సమ్మెచేసి పనులకి దూరంగా ఉంటే, దానికి boycotting అని పేరొచ్చింది.ఇలాంటివి మన తెలుగులో కూడా ఒకటి-రెండు లేకపోలేదు.ఉదా:- భీష్మించడం. ఈ క్రియ తెలుగులోనే ఉంది కానీ సంస్కృతంలో లేదు.
8. సమాస ఘటనం : (word-compounds) ఇంగ్లీషు మేధావులు గత శతాబ్దాల్లో ఉనికిలో లేని కొన్ని వ్యాకరణ సంప్రదాయాల్ని తమ భాషలో ప్రవేశపెట్టారు.వాడుకలో బహుళ ప్రాచుర్యం పొందినప్పటికీ ఇంగ్లీషు వ్యాకరణాల్లో మాత్రం ఆ నిర్మాణాలకు ఇప్పటికీ సముచిత స్థానం లేదు. వాటిల్లో సమాసాలొకటి. సమాసం రెండు వేరు వేరు అర్థాలు గల పదాలతో ఏర్పడే మిశ్రమం.ఆ మిశ్రమం నుంచి ఉప్పతిల్లే కొత్తపదం ఒక కొత్త అర్థాన్ని కూడా స్ఫురింపజేస్తుంది.ఉదా :- రాజ భవనం.ఇది రాజు కంటే, భవనం కంటే వేరైన ఒక ప్రత్యేకమైన శ్రేణికి చెందిన కట్టడాన్ని సూచిస్తుంది.సమాసాల సౌలభ్యాన్ని ఇంగ్లీషు మేధావులు త్వరగానే గ్రహించారు.ఇప్పుడు సమాసాలు లేకుండా ఇంగ్లీషు మాట్లాడ్డమే అసాధ్యం.ఒకవేళ అలా మాట్లాడితే ఇంగ్లీషు రాదేమోనని జాలిపడడం కూడా జరగొచ్చు.
కొందరు తలపోస్తున్నట్లుగా ఇంగ్లీషులో ఈనాడు మనకు కనిపించే పదాలు ఇతర భాషల నుండి మక్కికి మక్కి దిగుమతి చేసుకున్నవి కావు.ఆకాశం నుంచి హఠాత్తుగా ఊడిపడ్డవీ కావు.వాటి వెనుక ఇంగ్లీషు మేధావుల కృషి చాలా ఉంది.అలాంటి కృషినే ఇప్పుడు మనం కూడా చెయ్యాలనుకుంటున్నాం.కొత్త పదాల రూపకల్పన చేసేటప్పుడు ఇంగ్లీషు మేధావులు అనుసరించిన పద్ధతుల్నే మనం ఇప్పుడు చర్చిస్తున్నాం.
1. పోలిక (Analogy) :- అంతకుముందున్న పదాలకు సంబంధించిన కొత్త పదాలు అవసరమైనప్పుడు ఆ పదాల స్వరూపానికి కొద్దిగా మార్పులూ చేర్పులూ చేసి వేరే అర్థంలో వాడారు.అంతకుముందు కేవలం uncanny అనే పదం ఒక్కటే ఉండగా canny అనే పదాన్ని కల్పించారు.అంతకుముందు gnostic (ఒక ప్రాచీన క్రైస్తవ శాఖ సభ్యుడు) ఒక్కటే ఉండగా agonstic (అజ్ఞేయవాది, నాస్తికుడు) అనే పదాన్ని కల్పించారు.outrage అనేది అచ్చమైన ఆంగ్లో-శాగ్జన్ పదం కాగా దానికి విశేషణంగా outrageous అని లాటిన్ శైలిలో కల్పించారు.అంటే ఉన్న పదాల నుండే కొత్త పదాల్ని కల్పించారు.అలా కల్పించడం ఇంగ్లీషు/లాటిన్ వ్యాకరణ సూత్రాలకు విరుద్ధమైనా లెక్కచెయ్యలేదు.సూత్రాలు వర్తింప శక్యమైతే పాటించారు. పాటించడానికి అవకాశం లేనిచోట త్రోసిపుచ్చారు.
2. ధ్వన్యనుకరణ (Imitation) :- మనుషులు భావోద్వేగపు క్షణాల్లో చేసే అవ్యక్త కాకుస్వరాలకూ ధ్వనులకూ శబ్ద ప్రతిపత్తిని కల్పించారు.ఆ ధ్వనులకు- తెలిసిన ప్రత్యయాల్ని జోడించి కొత్త పదాల్ని నిష్పాదించారు.ఆ క్రమంలో lispism, yahoo, pooh-poohing, booing మొదలైన పదాలు పుట్టాయి.మనవాళ్ళు కూడా "చకచక, నిగనిగ" నుంచి చాకచక్యం, నైగనిగ్యం, నిగారింపు మొదలైన పదాల్ని నిష్పాదించారు.అయితే ఈ ప్రక్రియ ఇటీవలి కాలంలో వెనకబట్టింది.
3. అర్థాంతర ప్రకల్పన (Semantic alteration):- సాధారణ పరిస్థితుల్లో భాష చనిపోదు.ఇసుమంత మారుతుందంతే ! ఇంగ్లీషువారు అంతకుముందున్న పదాలకే కొత్త అర్థాల్ని అనువర్తించారు.fan, straw, (cheque)leaf, web, portal మొదలైనవి ఈ కోవకు చెందినవి.కాని ఇలా చెయ్యాలంటే భాషా పటిమ కన్నా మనిషిలో కొంత కవితాత్మకత తోడవ్వాలి.
4. పునరుద్ధరణ (Revival) :- భాషలో కొన్ని పదాలు బహు పాతవై ఉంటాయి.అవి నిఘంటువులకు మాత్రమే పరిమితమై ఉంటాయి.వాటిని ఇప్పుడెవరూ ఏ మాండలికంలోను వాడకపోవచ్చు.వాటికి సమానార్థకాలైన వేరే పర్యాయపదాలు ఇప్పుడు లభ్యమౌతూ ఉండొచ్చు.అంతమాత్రాన ఆ పాత పదాలు పనికిమాలినవి కావు.ఈ సత్యాన్ని ఇంగ్లీషువారు లెస్సగా కనిపెట్టారు.ఆ పదాల పాత అర్థాలకి సరిపోలిన కొత్త అర్థాల్లో వాటిని వాడడం మొదలుపెట్టారు. ఆధునికంగా లభ్యమౌతున్న పదాలకు తోడు ఈ పాత పదాలు కొత్త అర్థాల సోయగాలతో జతచేరి ఇంగ్లీషు భాషని నవయౌవనంతో పరిపుష్టం చేశాయి.olympics, carnival, domain మొదలైనవి ఇందుకు ఉదాహరణ.
5. మాండలికాల విస్తృత వినియోగం (universalization of dialects): ఇంగ్లీషులో ఎన్ని మాండలికాలున్నాయో ఎవరికీ అంతు చిక్కదు.అయితే ఇంగ్లీషువారు ఆ మాండలికాలన్నింటినీ సందర్భానుసారంగా ఉపయోగించుకుని భాషని శక్తిమంతం చేసుకున్నారు.మాండలిక పదాలకు ఇప్పటికే ఉన్న అర్థాలకి తోడు కొత్త అర్థాల్ని జతకలిపారు.కొన్ని సందర్భాల్లో Slang నుండి సైతం ప్రామాణిక భాషని సిద్ధం చేశారు.ఉదాహరణకి jazz అనే పదం New Orleans లో ఒక పచ్చి అశ్లీల క్రియాధాతువుగా మాత్రమే వాడుకలో ఉండేది.అదిప్పుడు ఒక గౌరవనీయమైన సంగీత కళారూపానికి నామధేయమైంది.
6. మిశ్ర పద నిష్పాదన (hybrid coinage) :- ఇంగ్లీషులో ఇప్పుడు"చెయ్యదగిన"అనే అర్థంలో క్రియాధాతువుల చివర చేర్చబడుతున్న able అనేది నిజానికి ఫ్రెంచి ప్రత్యయం. మొదట్లో ఇది adorable మొదలైన ఫ్రెంచి ఆదాన పదాలకు మాత్రమే చేరేది.క్రమంగా దాన్ని దేశి ఇంగ్లీషు పదాలక్కూడా యథేచ్ఛగా చేర్చడం మొదలైంది.ఈరోజు think, drink, eat, walk లాంటి అచ్చ ఇంగ్లీషు పదాలక్కూడా ఈ విధమైన పరిణామాన్ని చూస్తున్నాం.
మన సంప్రదాయంలో సంస్కృత పదాలతో జతకలిపి తెలుగుతో సహా ఏ ఇతర భాషాపదాలకైనా సరే సంధులూ, సమాసాలూ చెయ్యడం ఆదినుండి నిషిద్ధం.కలిసే అవయవాలు రెండూ సంస్కృత పదాలైతేనే సంధిసమాసాలు సాధ్యం.ఆ రకంగా అవసరం లేని సంస్కృత పదాలు కూడా తెలుగులోకి సమాసాల రూపంలో యథేచ్ఛగా చొఱబడిపోయాయి.ఒకప్పుడు ఇంగ్లీషులో కూడా ఇలాంటి సంప్రదాయమే ఉండేది.లాటిన్ గ్రీకు పదాలతో అచ్చ ఇంగ్లీషు పదాల్ని కలపకూడదు.అంతే కాక లాటిన్ సమాసాలు లాటిన్తో జరగాలి.గ్రీకు సమాసాలు గ్రీకుతోనే జరగాలి. లాటిన్ పదాలతో గ్రీకు పదాల్ని కలపకూడదు.
కాని ఆధునిక ఇంగ్లీషు మేధావులు ఈ సంప్రదాయాన్ని కావాలనే విశృంఖలంగా ఉల్లంఘించారు.తప్పలేదు, తప్పు లేదు.ఎందుకంటే సమాసంలో రెండో పదం కూడా ఆ భాషాపదమే అయివుండాలంటే, ఎంతమందికి లాటిన్ గ్రీకుల మీద పట్టుంటుంది ? అలా పదసృష్టి ఆగిపోతుంది. (మిగతాది వచ్చే టపాలో....)
మార్గదర్శకాల ప్రస్తావన (topic) ని కొనసాగిస్తున్నాను.
తెలుగులో కొత్త పదాల కల్పన చేసేటప్పుడు ఇంగ్లీషు పదాల్ని మక్కికి మక్కి దించుకోవడమో, అనువదించడమో కాక, ఇంగ్లీషులో పదాలు ఏర్పడిన విధానాన్ని ముందు సమగ్రంగా అధ్యయనం చేసి ఆ పద్ధతుల వెలుగులో తెలుక్కి వర్తించే సూత్రాల్ని ఏర్పఱచుకోవాలి.నా పరిశీలనలో ఇంగ్లీషు పదాలు చారిత్రికంగా స్థూలంగా రెండు రకాలుగా ఏర్పడ్డాయి.
1. అచ్చ ఇంగ్లీషు పదాలు 2. ఆదానాలు.
అచ్చ ఇంగ్లీషు పదాలు నాలుగు రకాలుగా ఏర్పడ్డాయి.
(అ) జెర్మానిక్ పదాలు :- తోటి జెర్మానిక్ భాషలైన డచ్, జర్మన్ భాషలతో పోలికలు గల ఇంగ్లీషు పదాలివి.
(ఇ) ఆంగ్లో-శాక్సన్ పదాలు :- మొదట్లో Angles అని పిలవబడ్డ ఆదిమ ఇంగ్లీషు వలసదార్లు ఇంగ్లండులోని స్థానిక శాక్సన్ జాతివారితో సమ్మేళనమై మాట్లాడ నారంభించిన భాష.
(ఉ) కెల్టిక్/గేలిక్ పదాలు : ఇంగ్లీషుకు పరిసర భాషలైన వెల్ష్, స్కాటిష్, ఈరిష్ భాషల ప్రభావంతో ఇంగ్లీషులోకి వచ్చి చేరిన పదాలు.
(ఎ) నోర్డిక్ పదాలు :- వైకింగులు ఇంగ్లండుని పరిపాలించిన కాలంలో వచ్చి చేరిన పదాలు.
ఇంగ్లీషులో రెండో అతిపెద్ద శబ్దవర్గమైన ఆదాన పదాల్ని కూడా 4 రకాలుగా వింగడించవచ్చు.
(అ) ప్రామాణిక ఆదానాలు (Learned Borrowings): సంస్కృత ప్రాకృత భాషల పదాల్ని తెలుగు గ్రహించినట్లే మత, మతేతర కారణాల వల్ల ముఖ్యంగా పునరుజ్జీవన (Renaissnace) కాలంలో లాటిన్, గ్రీకు పదాలు ఇంగ్లీషుని ముంచెత్తాయి.ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది.
(ఇ) చారిత్రిక ఆదానాలు : తెలుగు ఉర్దూ రాజుల ప్రభావానికి లోనైనట్లే, ఇంగ్లండుని నార్మన్ రాజులు పరిపాలించిన కాలంలో ఇంగ్లీషు ఫ్రెంచి ప్రభావానికి గురైంది.ఫ్రెంచివారిని అనుకరిస్తూ ఇంగ్లీషువారు కూడా పదాల చివర ఒక అనవసరమైన e చేర్చి రాయసాగారు. ఉదా :- wyf కాస్తా wife అయింది.
(ఉ) సామ్రాజ్య ఆదానాలు : ఇంగ్లీషువారు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో తమ రాజకీయాధికారాన్ని స్థాపించినప్పుడు స్థానిక భాషలు నేర్చుకోవడం, వాటిలోంచి అవసరమైన పదాల్ని గ్రహించడం జరిగింది.
ఇది తెలుగుని ఇంగ్లీషుతో పోల్చడానికి కాదని అర్థం చేసుకోవాలి.చాలామంది ఆ పొఱపాటు చేస్తారు. నార్మన్ రాజుల కాలంలో తప్ప మిగతా అన్ని కాలాల్లోను ఇంగ్లీషు ఒక దేశానికి అధికార భాషగా ఒక హోదాని వెలగబెడుతూ వచ్చింది.ఒక దేశానికి జాతీయభాషగా రాజపోషణకీ, దాని ద్వారా ప్రజాపోషణకి అది నోచుకుంది.అందుచేత అది ఎన్ని భాషల ప్రభావానికి లోనైనా తన అస్తిత్వానికి ప్రమాదం రాలేదు.తెలుగు పరిస్థితి పూర్తి విరుద్ధం.విజయనగర సామ్రాజ్యం అంతరించాక (క్రీ.శ. 1665 ప్రాంతం) ఒక అధికార భాషగా తెలుగు యొక్క అధ్యాయం ముగిసిపోయింది.అయినా ఇప్పటి దాకా ఈ భాష బతికే ఉండడం గొప్ప సర్కస్ ఫీటే.అందుచేత తెలుగు భాషాభిమానం భాషోన్మాదమూ కాదు.విశాలాంధ్ర భావన సామ్రాజ్యవాదమూ కాదు.
అన్యాయానికి గురైన తెలుగు భాషని నిలబెట్టుకోవడమే మన లక్ష్యంగా ఉండాలని, ఆ క్రమంలో భాషని మింగేసే చర్యలకి పాల్పడకూదదనీ, అంతిమంగా మనం మన తెలుగు వ్యాప్తికే ఉపయోగపడాలి తప్ప ఇతర భాషల భుజకీర్తులకు మెఱుగులు దిద్దే కార్యక్రమంలో పాలుపంచుకోకూడదనీ చెప్పడానికే ఇదంతా రాశాను.అసలు ప్రస్తావనకు నేనింకా రాలేదు.ఈసారి సమర్పించబోయే రాతలో ఇంగ్లీషువారు పదాల రూపకల్పనలో ప్రదర్శించిన సృజనాత్మకత గురించి రాస్తాను.
తెలుగులో కొత్త పదాల్ని కల్పించడమనే కార్యకలాపం మూడు దిశల్లో జరగాల్సి ఉంది.
1. ఇంగ్లీషు పదాలకు సమానార్థకాల (equivalents)కల్పన/అన్వేషణ
2. ఇంగ్లీషులో లేనటువంటివి/మన స్థానిక తెలుగు భాషుల (native Telugu speakers) భావాల వెల్లడింపునకు ఉపయోగపడేవీ అయిన కొత్త పదాల నిష్పాదన (coining)
3.అన్యదేశ్యాల స్థానికీకరణ (nativization)
ఏది చెయ్యాలన్నా ముందు మన భాషాస్వరూపం గురించి మనకు కొంత అవగాహన ఉండాలి.అది ఏర్పడాలంటే ఏ శబ్దార్థచంద్రికనో రోజూ ముందేసుకుని ఏ పదం మనకు పనికొచ్చే లక్షణాలు కలిగి ఉందా అని కాస్త మధనపడాలి. రెండోది- బాలవ్యాకరణాన్ని కూడా శోధించాలి.ఎందుకంటే ఒక మహాకవి చెప్పినట్లు "గతం నాస్తి కాదు నేస్తం, అది అనుభవాల ఆస్తి."
పాత పుస్తకాల బూజు దులిపి దుర్భిణితో గాలిస్తున్నంత మాత్రాన ప్రతి చాదస్తాన్ని నెత్తిన వేసుకుంటామనుకోకూడదు. "కొత్త పదాలు" అంటే - ఏ విధమైన కొత్త పదాలు ? పదాల్లో రకాలున్నాయి.ఇంగ్లీషువాడు వాటికి Parts of speech అని పేరు పెట్టాడు.మన భాషకు సంబంధించినంతవరకు మనం సిద్ధం చెయ్యాల్సినవి :
1. క్రియాధాతువులు (verb-roots)
మళ్ళా వీటిల్లో చాలా రకాలున్నాయి.తెలుగుభాష నామవాచకాల్ని క్రియలుగా ఎలా మారుస్తుంది ? క్రియల్ని నామవాచకాలుగా ఎలా మారుస్తుంది ? ఒక నామవాచకంలోంచి ఇంకో నామవాచకాన్ని ఎలా నిష్పాదిస్తుంది ? వీటన్నింటి నుంచి విశేషణాల్ని ఎలా పుట్టిస్తుంది ? మళ్ళా విశేషణాల్లోంచి నామవాచకాల్నీ క్రియల్నీ ఎలా రప్పిస్తుంది ?
ఇవన్నీ కూలంకషంగా తెలుసుకుంటే సగం అయోమయం (confusion)లోంచి బైటపడతాం.
ఈ విషయాలు వచ్చే టపాలో....
Thursday, August 09, 2007
1. కొత్త వాడుకలు అలతి అలతి పదాలతో ఏర్పఱచిన చిరుసమాసాలై ఉంటే మంచిది. పర్యాప్తమైన చిరుతనాన్ని (optimum smallness) నిర్వచించడం కష్టం. కాని స్థూలంగా (అ) తెలుగులిపిలో అయిదు అక్షరాలకి మించని పదాలూ (ఇ) ఒకవేళ అయిదు అక్షరాలకి మించినా, ఆరేడు అక్షరాలు కలిగి ఉన్నా, రెంటి కంటే ఎక్కువ అవయవాలు లేని సమాసాలూ చిఱువాడుకలు అని భావిచవచ్చు.
2.సాఫీగా అర్థమయ్యే ఇంగ్లీషు పదాల (plain English terms)కి విశేషణాల (adjectives)తో కూడిన వర్ణనాత్మక పదజాలాన్ని సృష్టించడానికి పూనుకోకూడదు. అలాంటి ప్రయత్నం సాధారణంగా కొండవీటి చాంతాడంత సమాసాలకి దారితీస్తుంది. Loan translation (అంటే మూలభాషలోని అర్థాన్ని మనం భాషలోకి అనువదించి పదాలు కల్పించడం) కొన్నిసార్లు తప్పదు. కాని అన్ని వేళలా అదే మంత్రం గిట్టుబాటు కాదు. బ్లాగ్ లాంటి పదాల్ని "దాదాపుగా" అలాగే ఉంచి తత్సమాలుగా వాడుకోవడం మంచిది.
3. తెలుక్కి స్వాభావికమైన జాతీయాన్ని నుడికారాన్ని (idiom) భ్రష్టుపట్టించకూడదు. తెలుగులో ఇమడని నిర్మాణాలు (structures)శీఘ్రంగా పరమపదిస్తాయని మఱువరాదు.
4. భాషా పరిశుద్ధతని నిలబెట్టడం మన లక్ష్యం కాదు. భాషని సుసంపన్నం చెయ్యడం, ప్రయోగాత్మకతని ప్రోత్సహించడం మన లక్ష్యం. కాబట్టి వైరి సమాసాల్ని మిశ్రసమాసాల్ని విరివిగా అనుమతించాలి. అయితే అవి శ్రవణ సుభగంగా (వినసొంపుగా) ఉంటేనే పదికాలాల పాటు నిలుస్తాయి. వికారమైన కాంబినేషన్లది అల్పాయుర్దాయం. తప్పనిసరై దిగుమతి చేసుకున్న ఇంగ్లీషు పదాలకి సంస్కృత ప్రత్యయాల (suffixes)నీ, ఉపసర్గల (prefixes) నీ చేర్చి వాడుకోవడం అమోదయోగ్యమే. ఉదా : కర్బనీకరణ మొదలైనవి.
5. ఇంగ్లీషులో లాగే తెలుగులో కూడా ప్రత్యాహారాల (abbreviations) ద్వారా ఏర్పడే acronyms ని (వెకిలిగా పరిగణించకుండా) వాటికి ఒక గౌరవనీయ స్థానాన్ని కల్పించడం చాలా అవసరం. తెలుగులో ఇప్పటికే అలాంటివి కొన్ని ఉన్నాయి.
ఉదా :-
వీటి సంఖ్య ఇంకా ఇంకా పెరగాలి. ముఖ్యంగా తెలుగు శాస్త్ర సాంకేతిక రంగాల్లో !
6. మిశ్ర పద నిష్పాదన (hybrid coinage)ని ప్రోత్సహించాలి. అంటే, ఒక భాషకి చెందిన ఉపసర్గల్నీ ప్రత్యయాల్నీ ఇంకో భాషకి చెందిన దేశి పదాలకి చేర్చి కొత్త పదాలు పుట్టించడం. ఉదాహరణకి :- దురలవాటు. ఇందులో "దుర్" అనే ఉపసర్గ సంస్కృతం. "అలవాటు" తేట తెలుగు పదం. ఇలాంటివే నిస్సిగ్గు, ప్రతివాడు, అతి తిండి మొదలైనవి. ఇలాంటివి చాలా ఉన్నాయి కాని సరిపోవు. ఇవి వందలుగా వేలుగా పెరగాలి.
7. అన్నింటి కంటే ముఖ్యమైన విషయం ఒకటుంది. పాత పదాలు, కావ్యభాష, గ్రాంధికం అంటూ కుహనా అభ్యూదయ లేబుళ్ళు వేసి మనం నిర్దాక్షిణ్యంగా త్రోసిపుచ్చిన అచ్చ తెలుగు పదజాలం అపారంగా ఉంది. అలాగే అలాంటి సంస్కృత పదజాలం కూడా విపరీతంగా ఉంది.
అభ్యూదయపు చీకటి కోణం
ఆ పదజాలాన్నంతా ఇప్పుడు వెలికి తీయక తప్పదు. ఈ సందర్భంగా ప్రాచుర్యంలోకి వచ్చిన కొన్ని దురభిప్రాయాల్ని కూడా సవరించాలి.
తెల్ల దేశాల్లో వారికి తెలిసిన plain language, layman's vocabulary అనే పదాలకి అర్థం వేరు. మన దేశంలో layman's language కి అర్థం వేరు. అక్కడి layman's language మన layman's language కంటే అత్యంత సంపన్నమైనది. శక్తిమంతమైనది కూడా. మన దేశంలో వాడుకలో ఉన్న layman's language ఒక చచ్చు భాష, బీద భాష కూడా. ఇందులో పదాలు కొద్ది. వ్యక్తీకరణలు పూజ్యం. మన laymen కనీసం ఐదో తరగతి వరకైనా చదివినవారు కాకపోవడం ఇందుకో కారణం. పదో తరగతి వరకు చదివిన వారిక్కూడా పుస్తక పఠనాసక్తి లేకపోవడం మరో కారణం. కాబట్టి అలాంటివారిని దృష్టిలో పెట్టుకుని మనం కొత్త పదజాలాన్ని రూపొందించడానికి పూనుకోకూడదు. అలా పూనుకుంటే తెలిసిన పదాల గుడుగుడుగుంచంలోనే తిరగాల్సి వస్తుంది.
చెప్పాల్సింది ఇంకా చాలా ఉంది. తరువాత రాస్తాను.
